రక్షణ శాఖలోకి త్వరలో మహిళలు
న్యూఢిల్లీః రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిలటరీ పోలీస్ విభాగంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. సైనిక బలగాల్లో లింగ వైరుధ్యాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. తొలిదశలో భాగంగా 800 మంది మహిళలను మిలటరీ పోలీసు విభాగంలో చేర్చుకుంటారు.
1992 నుంచి వైద్య సేవలు వంటి ఎంపిక చేసిన విభాగాల్లో మిలటరీ పోలీసులో మహిళలను అనుమతించారు.మరోవైపు సైనిక సిబ్బంది ర్యాంకుల అప్‌గ్రేడేషన్‌ను చేపట్టాలని ప్రతిపాదించారు. రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టిన వెనువెంటనే కీలక నిర్ణయాలు వెలువడటం గమనార్హం. తొలి పూర్తిస్ధాయి మహిళా రక్షణ మంత్రి నిర్మల దేశీయ పరిజ్ఞానంతో మంత్రిత్వ శాఖను కొత్త పుంతలు తొక్కించడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నఅంశాల పరిష్కారం తన ప్రాదాన్యతాంశాలుగా ముందుకెళ్లనున్నారు.