ఐక్యరాజ్యసమితి(న్యూయార్క్), అమెరికా : ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా భారతదేశ రాజధాని న్యూఢిల్లీ అవతరించనుంది. 2028లో న్యూఢిల్లీ ప్రజలతో కిక్కిరిసిపోనుందని ఐక్యరాజ్యసమితి తన అంచనాల నివేదికలో పేర్కొంది. 2050 కల్లా భారత్‌లోని అత్యధిక జనాభా పట్టణ ప్రాంతాల్లో ఆవాసం ఏర్పరచుకుంటుందని వివరించింది. ఇదే సమయానికి ప్రపంచ జనాభాలోని 68 శాతం ప్రజలు పట్టణప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకుంటాని వెల్లడించింది.
ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 55 శాతం మంది మాత్రమే పట్టణాల్లో నివసిస్తున్నారు. 2018-2050 మధ్యకాలంలో అత్యధికంగా 35 శాతం పట్టణ జనాభా పెరుగుదల భారత్, చైనా, నైజీరియాల్లో ఉండనుందని వెల్లడించింది. ఈ కాలంలో భారత్‌లోని 416 మిలియన్ల మంది, చైనాలో 255 మిలియన్ల మంది, నైజీరియాలో 189 మిలియన్ల మంది పట్టణాల్లో ఆవాసాలు ఏర్పరచుకుంటారని వివరించింది.
ప్రస్తుతం 37 మిలియన్ల నివాసితులతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా టోక్యో అవతరించింది. ఆ తర్వాతి స్థానాల్లో 29 మిలియన్లతో న్యూఢిల్లీ, 20 మిలియన్లతో ముంబై, బీజింగ్, ఢాకా, కైరోలు ఉన్నాయి. జనాభా కొరతతో ఇబ్బందిపడుతున్న జపాన్‌లో ఆ పరిస్థితి భవిష్యత్‌లో మరింత దిగజారబోతున్నట్లు నివేదిక వివరించింది.
2020 నుంచి టోక్యోలో జనాభా పెరుగుదల మందకొడిగా మారబోతోందని పేర్కొంది. దీంతో 2028లో టోక్యోను వెనక్కు నెట్టి న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా అవతరిస్తుందని చెప్పింది. అప్పటికి న్యూఢిల్లీ జనాభా 37.2 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.
జనాభా-ఆందోళనకరం :
భారీ సంఖ్యలో పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేక్రమంలో దేశాలు పెను సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక జనాభా వల్ల తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నిలువ నీడ, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వాలకు సవాలుగా మారుతాయని ఐక్యరాజ్యసమతి నివేదిక పేర్కొంది.
43 మెగా నగరాలు :
నివేదిక ప్రకారం 2030 నాటికి పది మిలియన్లకు పైగా జనాభా కలిగిన మెగా నగరాలు 43 తయారవుతాయి. 1950లో 751 మిలియన్లుగా ఉన్న ప్రపంచ పట్టణ జనాభా శరవేగంగా పెరుగుతూ వస్తోంది. 2018 నాటికి ఈ సంఖ్య 4.2 బిలియన్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment