డీడీసీఏలో కామాంధులు! | Delhi CM Kejriwal Severe allegations | Sakshi
Sakshi News home page

డీడీసీఏలో కామాంధులు!

Published Wed, Dec 30 2015 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

డీడీసీఏలో కామాంధులు!

డీడీసీఏలో కామాంధులు!

♦ జైట్లీ హయాంలో చాలా దారుణాలు జరిగాయి 
♦ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు
♦ సీబీఐ, ఐబీ, ఢిల్లీ పోలీస్ విభాగాల్లోని సమర్ధులు కావాలి
♦ ఎన్‌ఎస్‌ఏకు విచారణ కమిషన్ చైర్మన్ గోపాల సుబ్రమణ్యం లేఖ
 
 న్యూఢిల్లీ: కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘డీడీసీఏ’ వివాదం తీవ్రమవుతోంది. ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఢిల్లీ, జిల్లా క్రికెట్ సంఘం(డీడీసీఏ)లో దారుణ అక్రమాలు, అవినీతి జరిగాయని మంగళవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. డీడీసీఏ అధికారులు లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంగ్ల న్యూస్ చానల్ ఎన్‌డీటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో నాటి అక్రమాలకు సంబంధించి ఒక ఉదంతాన్ని వివరించారు. ‘ఒకరోజు ఓ సీనియర్ జర్నలిస్ట్ నాకు ఫోన్ చేశారు. క్రికెట్ ఆడే తన కుమారుడు సెలక్ట్ అయ్యాడంటూ ఆయన చెప్పారు.

కానీ, డీడీసీఏ విడుదల చేసిన జాబితాలో ఆ అబ్బాయి పేరు లేదు. మర్నాడు, డీడీసీఏలోని ఒక ఉన్నతాధికారి నుంచి ఆ జర్నలిస్ట్ భార్య మొబైల్ ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ఈ రోజు నా ఇంటికి వస్తే.. నీ కుమారుడి పేరు లిస్ట్‌లో చేరుతుంది అని ఆ మెసేజ్‌లో ఉంది’ అని కేజ్రీవాల్ వివరించారు. ఇంతకుమించిన దారుణాలు అనేకం జరిగాయన్నారు. డీడీసీఏ అక్రమాలపై తన ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ పని ప్రారంభించిన తరువాత.. కమిషన్ ముందు హాజరయ్యేందుకు ఆ జర్నలిస్ట్ అంగీకరించాడని తెలిపారు.

కాగా, డీడీసీఏ అక్రమాలపై ఢిల్లీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య విచారణ కమిషన్ చైర్మన్, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణ్యం.. దర్యాప్తులో పాలు పంచుకునేందుకు సీబీఐ, ఐబీ, ఢిల్లీ పోలీస్ విభాగాల నుంచి ఐదుగురి చొప్పున సమర్థులైన, నిజాయితీపరులైన అధికారులను అందుబాటులో ఉంచాలంటూ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌కు లేఖ రాశారు. డీడీసీఏ దర్యాప్తులోని కొన్ని అంశాలు జాతీయ భద్రతకు సంబంధించినవై ఉండొచ్చని ఆ లేఖలో వివరించారు.

కాగా, ఈ చర్యను చిల్లర రాజకీయ ప్రచార జిమ్మిక్కుగా బీజేపీ అభివర్ణించింది. మరోవైపు, గోపాల సుబ్రమణ్యం కమిషన్‌ను చట్ట వ్యతిరేకమంటూ కేంద్రం కొట్టేసినా డీడీసీఏ అక్రమాలపై ఆ కమిషన్ విచారణ కొనసాగుతుందని మంగళవారం కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. ఏ విభాగం నుంచైనా అధికారులను కోరే  అధికారం, హక్కు కమిషన్ చైర్మన్‌గా గోపాల సుబ్రమణ్యంకు ఉందన్నారు. అవినీతి వ్యతిరేక విభాగం నుంచి ఐదుగురు అత్యుత్తమ అధికారుల పేర్లను సూచించాలంటూ కేజ్రీవాల్‌కు కూడా గోపాల సుబ్రమణ్యం లేఖ రాశారు. డీడీసీఏ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రమే కోరింది కనుక, దర్యాప్తునకు అవసరమైన సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని గోపాల సుబ్రమణ్యం స్పష్టం చేశారు.

 ద్విచక్రవాహనాలకూ ‘సరిబేసి’!
 సాక్షి, న్యూఢిల్లీ: జనవరి 1 నుంచి ఢిల్లీలో అమలు చేయనున్న ‘సరిబేసి’ విధానాన్ని త్వరలో ద్విచక్రవాహనాలకు  వర్తింపజేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. ద్విచక్రవాహనాలే ఎక్కువ కాలుష్య కారకాలని తేలినప్పటికీ.. సరిబేసి ఫార్ములా నుంచి వీటికి మినహాయించడంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. రోడ్లపై గందరగోళా నివారణకే కొన్నాళ్ల పాటు ద్విచక్రవాహనాలకు మినహాయింపునిచ్చినట్లు తెలిపారు.

 కేజ్రీ.. ముందు రాజ్యాంగం చదవండి!
  కేజ్రీవాల్ తరఫున పని చేస్తూ ఈ డ్రామాకు తెరదీశారని గోపాల సుబ్రమణ్యంపై బీజేపీ ధ్వజమెత్తింది. కేజ్రీవాల్ గతంలో పలు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారని, నిర్ణయాలు తీసుకునేముందు రాజ్యాంగాన్ని చదివితే.. ఢిల్లీ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన పారిశుద్ధ్యం, డెంగ్యూని నియంత్రించడం వంటి అంశాల గురించి తెలుస్తుందని పేర్కొంది. డీడీసీఏ కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టరైన సొసైటీ, దానిపై విచారణకు ఆదేశించే అధికారం ప్రభుత్వానికి లేదని పార్టీ కార్యదర్శి శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా దేశాన్ని, దేశ ప్రజలను కేజ్రీవాల్ అవమానిస్తున్నారన్నారు.

జైట్లీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గానూ జైలుకెళ్లేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉండాలన్నారు. ‘కేజ్రీవాల్‌కు సీబీఐ అంటే భయంలేదు. నాకు వ్యతిరేకంగా సీబీఐ ఎలాంటి దర్యాప్తునైనా చేపట్టొచ్చు’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కమిషన్ చట్టబద్ధతకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం ప్రధాని కార్యాలయంలో ఉందన్నారు. ‘కమిషన్‌ను వారు ఆమోదించినా, తిరస్కరించినా విచారణపై ఎలాంటి ప్రభావం చూపదు. విచారణ కొనసాగుతుంది’ అని తేల్చిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement