గల్లీలు ఊడుస్తున్న ఢిల్లీ మంత్రులు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు రోడ్డెక్కారు. మున్సిపల్ కార్మికులు తమ విధులను బహిష్కరించి రోడ్లెక్కడంతో వారి బాధ్యతలు నెరవేర్చేందుకు ఆప్ మంత్రులు తట్టాబుట్టా, చీపుర్లు పట్టుకుని ఢిల్లీ వీధులు శుభ్రం చేసే పనిలో పడ్డారు. వీరికి తోడు ఆప్ కార్యకర్తలు కూడా తోడవడంతో ఢిల్లీ వీధుల శుభ్రం చేసే కార్యక్రమం దండిగా సాగుతోంది. తమకు జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కార్మికులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో పీడబ్ల్యూడీ అధికారులు ప్రత్యేక టాస్క్ పోర్స్ ను ఉపయోగించి ఢిల్లీ వీధులను శుభ్రం చేయిస్తున్నారు. వీరితోపాటు ఆ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా పాల్గొంటున్నారు. ఇక ఆదివారం ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ షాదారా ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా మంత్రులు కపిల్ మిశ్రా, ఇమ్రాన్ హుస్సేన్ కారవల్ నగర్, బల్లిమారన్ ప్రాంతంలో చెత్తచెదారం ఊడుస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్పార్పంజ్ ప్రాంతంలో వీధులు ఊడ్చే కార్యక్రమం చేపట్టనున్నారు.