ఇక పెళ్లిళ్లపై నిఘా నేత్రం
దేశ రాజధాని నగరంలో ప్రాణాంతకంగా పరిణమించిన కాలుష్యాన్ని నివారించేందుకు ఇటీవల 'సరి-బేసి' కార్ల విధానాన్ని తీసుకొచ్చిన ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు అట్టహాసంగా జరుపుకొనే పెళ్లిళ్లపై కన్నేసింది. ఢమాల్, ఢమాల్ అనే టపాసుల పేలుళ్లను, ఢమ ఢమ డప్పు శబ్దాలను, కర్ణభేరి పగిలిపోయేలా వినిపించే మైక్ శబ్దాలను నియంత్రించాలని, అలాగే ఆహార పదార్థాల వృధాను అరికట్టాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది.
దీనికోసం శబ్దాలను కొలిచే యంత్రాలను సొంత డబ్బులతో కొనుగోలు చేసి అన్ని కళ్యాణ మండపాలలో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. పశ్చిమబెంగాల్‌లో లాగా టపాసులు కాల్చడాన్ని 90 శాతం నియంత్రించాలని, కేవలం లాంఛనంగా కాల్చేందుకే అనుమతించాలని నిశ్చయించింది. పెళ్లిళ్ల సీజన్‌లో టపాసుల కారణంగా వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. కమిటీ ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేసేందుకు, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రతి పెళ్లి మండపం వద్ద ఇద్దరు, ముగ్గురు పౌర అధికారులతో నిఘాను ఏర్పాటు చేయాలని పీసీబీ నిర్ణయించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి నిర్ణయాలను అమలు చేసేందుకు వీలుగా ప్రతి జిల్లా స్థాయిలో నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా కమిటీ తీర్మానించింది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనల మేరకే కాలుష్య నియంత్రణ మండలి ఈ నిర్ణయాలు తీసుకుంది. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే ఢిల్లీ వాసులకు పీడకలే. కంటి మీదకు కునుకు రాదు. టపాసుల పేలుళ్లతో పాటు వాయిద్యాల మోత, హోరెత్తే సంగీతంతో తల వాచిపోతుంది. సీజన్‌లో రోజుకు దాదాపు 20 వేల చొప్పున పెళ్లిళ్లు జరుగుతాయి. దక్షిణ ఢిల్లీలోని ఛాతర్‌పూర్, మెహరౌలి, ఎన్‌హెచ్ వన్ వెంటనున్న అలీపూర్ ఎన్‌హెచ్ 24 వెంటనున్న వైశాలి, కౌశాంబి ప్రాంతాలు పెళ్లిళ్లకు పేరెన్నికగన్న ప్రాంతాలు.