సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని హజ్రత్ నిజూముద్దీన్ దర్గాలోనికి మహిళ ప్రవేశం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించనుంది. ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకుని దర్గాలో మహిళలను అనుమతించాలని పూణేకు చెందిన న్యాయ విద్యార్ధినులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 27న తాము దర్గాను సందర్శించేందుకు వెళ్లగా దర్గా వెలుపల మహిళలకు ప్రవేశం లేదని నోటీసు అతికించారని పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.
దర్గాలోనికి మహిళల ప్రవేశాన్ని అనుమతించేలా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులతో పాటు దర్గా నిర్వహణ కమిటీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు కోరారు. మహిళల ప్రవేశాన్ని అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేయాలని కోరారు. నిజాముద్దీన్ దర్గా బహిరంగ ప్రదేశమని, మసీదులోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం లింగ వివక్షగా పరిగణించాలని పిటిషనర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ముంబైలోని హజి అలీ దర్గా, అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ దర్గాల్లో మహిళలను అనుమతిస్తున్న ఉదంతాలను పిటిషన్‌లో వారు ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment