‘కథువా’ కేసు: మీడియా అత్యుత్సాహం | Delhi High Court Slams Media for Revealing Kathua Victim Name | Sakshi
Sakshi News home page

సంయమనం పాటించని మీడియా

Published Mon, Apr 16 2018 3:32 PM | Last Updated on Mon, Apr 16 2018 3:40 PM

Delhi High Court Slams Media for Revealing Kathua Victim Name - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ రేప్, హత్య కేసులో బాధితురాలు అసలు పేరు వెల్లడించకుండా, ఆమె ఫొటోను ప్రచురించకుండా మీడియా ఎంతో సంయమనం పాటించింది. తమ కూతురు తప్పు చేయనప్పుడు పేరు వెల్లడిస్తే తప్పేమిటంటూ నిర్భయం తల్లిదండ్రులు ఆంగ్ల మీడియాకు అసలు పేరు వెల్లడించినప్పటికీ మీడియా ఆ పేరును బహిర్గతం చేయకుండా సంయమనం చూపింది. అదే కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహికంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన సంఘటనలో మీడియా ఆ పాప ఫొటోతో సహా ఆమె పేరును బహిర్గతం చేసింది.

ఈ విషయంపై దేశంలోని పలు దినపత్రికలు, టీవీ ఛానళ్లను వివరణ ఇవ్వాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతామిట్టల్, హరి శంకర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఎవరు ఫిర్యాదు చేయకపోయినా ఆ బెంచీ ఈ విషయాన్ని ‘సూమోటా’గా విచారణకు స్వీకరించింది. బాధితుల పేర్లను ముఖ్యంగా మైనర్ల పేర్లను వెల్లడించకుండా భారతీయ శిక్షాస్మృతిలోని 228ఏ ఆంక్షలు విధించింది. బాధితుల పేర్లను వెల్లడించాలంటే వారి అతి దగ్గరి రక్త సంబంధికుల నుంచి లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకోవాలి. అలాంటి అవకాశం లేనప్పుడు ఏదైనా రిజస్టర్డ్‌ ప్రజా సంక్షేమ సంస్థ లేదా సంఘం ప్రధాన కార్యదర్శి లేదా చైర్మన్‌ల నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి.

కథువా దారుణ, రేప్‌ హత్య కేసులో బాధితురాలి ఫొటోను ఇచ్చి పేరు వెల్లడించిందీ ఆ పాప తండ్రే. అయితే ఆయన నుంచి ఎవరు కూడా లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకున్నట్లు దాఖలాలు లేవు. నీలిరంగు సెల్వార్‌ కమీజ్‌ దుస్తుల్లో కెమేరావైపే చూస్తున్న కథువా బాధితురాలి ఫొటోను వివరాలను ముందుగా ‘రైజింగ్‌ కశ్మీర్, గ్రేటర్‌ కశ్మీర్‌’ అనే స్థానిక ఆంగ్ల పత్రికలు ప్రచురించాయి. ఆ తర్వాత రెండు నెలలకు జాతీయ మీడియా స్పందించి ఆ పాప ఫొటోను, జరిగిన ఘటనపై ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. బాధితురాలి పేరు వెల్లడించకుండా కశ్మీర్‌ మీడియా సంయమనం పాటించక పోవడానికి కారణం ‘మతం’ దృష్టితో సంఘటనను చూడడమేనని స్పష్టం అవుతుంది.

బాధితుల పేర్లను వెల్లడించినందుకు గతంలో ఒక్క జర్నలిస్టులపైనే కాకుండా పోలీసులు, ఇతరులపై కూడా కేసులు నమోదయ్యాయి. బాధితురాలి పేరును వెల్లడించినందుకు 2016లో ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతిమలివాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు పంపించిన నోటీసులోనే ఆమె 14 ఏళ్ల బాధితురాలి పేరును బహిర్గతం చేశారు. ఓ రేప్‌ కేసులో బాధితురాలి పేరు వెల్లడించినందుకు గతేడాది ఢిల్లీ కోర్టు, ఢిల్లీ పోలీసులను తీవ్రంగా మందలించింది. 2017 సంవత్సరంలో జరిగిన రేప్‌ సంఘటనల్లో 34 కేసుల్లో జాతీయ పత్రికలు పేర్లు, వివరాలను వెల్లడించాయని ఓ నివేదిక తెలియజేస్తోంది. వాటిల్లో దళితులపై జరిగిన రేప్‌ కేసులే ఎక్కువగా ఉన్నాయి. కథువా కేసులో పాప ఫొటోను ప్రచురించడం వల్లనే ఆ వార్త ఎక్కువ సంచలనం సృష్టించిందనే వాదన కూడా ఉంది. అయితే మరి, ఢిల్లీ నిర్భయ కేసు కూడా ఇంతకన్నా ఎక్కువ సంచలనమే సృష్టించిందికదా! ఇక్కడ సంచలనానికి పేర్లు, ఫొటోలకన్నా జరిగిన దారుణం తీరు కారణంగానే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement