మార్చురీ వద్ద రోదిస్తూ బంధువులకు సమాచారం చేరవేస్తున్న బాధితురాలు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని అర్పిత్ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. సెంట్రల్ ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని నాలుగంతస్తుల హోటల్‌లో మంగళవారం వేకువజామున ఈ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 17 మంది మరణించగా.. మరో 35 మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. కేరళలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఈ ప్రమాదంలో మృతి చెందగా... తన తండ్రి గురించి ఎటువంటి సమాచారం దొరకలేదంటూ ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అతడితో పాటు ప్రత్యక్ష సాక్షులు, ఫైర్ ఆఫీసర్ చెప్పిన విషయాలు ఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి.
మా నాన్నా ఆచూకీ తెలియలేదు
అర్పిత్ ప్యాలెస్‌లోని కిచెన్ సూపర్‌వైజర్ లాల్ చంద్ ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఈ విషయం గురించి అతడి కుమారుడు హిమాన్షు మాట్లాడుతూ.. ‘ నేను హోటల్ దగ్గరికి వచ్చే సమయానికి జనమంతా పోగై ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కలిసి శవాలను బయటికి తీసుకువస్తున్నారు. ఈ విషయం గురించి వెంటనే అమ్మా వాళ్లందరికీ చెప్పాను. వాళ్లు ఇక్కడికి రాగానే నాన్న గురించి అడిగాము. కానీ మాకు సమాధానం దొరకలేదు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులన్నింటిలో వెదికాము. అయినా నాన్న జాడ తెలియలేదు. అసలు ఆయన బతికి ఉన్నారో లేదోనన్న విషయం అర్థం కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక ఈ ఘటన గురించి ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి మాట్లాడుతూ... ‘షార్ట్ సర్క్యూటే నిప్పును రాజేసిందని ప్రాథమిక విచారణలో తేలింది. మంటలు వేగంగా విస్తరించడంతో నిద్రలో ఉన్న అతిథులు తప్పించుకోవడం కష్టమైంది. ఎక్కువ మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు కాలిన గాయాలతో చనిపోయారు. హోటల్‌లోని ప్రతీ అంతస్తులో మంట తీవ్రతకు బొగ్గుగా మారిన శవాలు ఉన్నాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించి ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి అలాగే మరణించారు’ అని వ్యాఖ్యానించారు. హోటల్ గదుల్లో వాడిపడేసిన కార్బన్ డయాక్సై డ్ సిలిండర్లు కనిపించాయి. దీనిని బట్టి మంటలను ఆర్పడానికి వారు ప్రయత్నించినట్లు తెలుస్తోంది’ అని పేర్కొన్నారు.
కాగా ఈ ఘటనలో హోటల్ జనరల్ మేనేజర్‌తో పాటు మరో ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు కూడా ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment