
దినకరన్, సుఖేష్ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు
రెండాకుల గుర్తు కోసం టీటీవీ దినకరన్ చేసిన ప్రయత్నం బాగా బెడిసికొట్టింది. తాజాగా ఆయనతో పాటు ఆయన తరఫున బ్రోకర్‌గా వ్యవహరించిన సుఖేష్ చంద్రశేఖర్ మీద కూడా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రెండాకుల గుర్తు కోసం సుఖేష్‌కు దినకరన్ కొంత లంచం డబ్బులు ఇచ్చినట్లు ఆ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన నేరంలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఇప్పుడు దినకరన్, సుఖేష్ ఇద్దరి పేర్లు ఉన్నాయి.
(చదవండి: సుకేష్.. చాలా సుఖ పురుషుడు!)
జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా భారీ మొత్తంలో డబ్బులు పంచడం, దానికి సంబంధించి ఉప్పందడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయగా 80 కోట్ల రూపాయలకు పైగా పంచినట్లు ఆధారాలు లభించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించి ఏకంగా ఆర్కేనగర్ ఉప ఎన్నికలనే రద్దుచేసింది. ఇలా భారీగా డబ్బులు పంచారన్న కారణంతో ఒక ఉప ఎన్నికను రద్దు చేయడం బహుశా ఇదే మొదటిసారి. అప్పుడే దినకరన్ - శశికళ వర్గం తమ పార్టీ వెబ్‌సైట్‌లోను, సోషల్ మీడియాలోను రెండాకుల గుర్తును విస్తృతంగా ప్రచారం చేసుకుంది. దానిపై కూడా ఈసీ తీవ్రస్థాయిలో మండిపడింది. అమ్మకు సంబంధించిన గుర్తు తమకు వస్తే తప్ప ఎన్నికల్లో ప్రజలు ఓటేసే అవకాశం లేదని భావించిన దినకరన్.. ఆ గుర్తు కోసం ఏకంగా ఈసీకే లంచం ఇవ్వాలని ప్రయత్నించి అడ్డంగా దొరికేశారు. ఆయనకు సహకరించిన సుఖేష్ కూడా బుక్కయ్యాడు.