sukash chandrasekhar
-
దినకరన్, సుఖేష్ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు
రెండాకుల గుర్తు కోసం టీటీవీ దినకరన్ చేసిన ప్రయత్నం బాగా బెడిసికొట్టింది. తాజాగా ఆయనతో పాటు ఆయన తరఫున బ్రోకర్‌గా వ్యవహరించిన సుఖేష్ చంద్రశేఖర్ మీద కూడా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రెండాకుల గుర్తు కోసం సుఖేష్‌కు దినకరన్ కొంత లంచం డబ్బులు ఇచ్చినట్లు ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన నేరంలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో ఇప్పుడు దినకరన్, సుఖేష్ ఇద్దరి పేర్లు ఉన్నాయి. (చదవండి: సుకేష్.. చాలా సుఖ పురుషుడు!) జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా భారీ మొత్తంలో డబ్బులు పంచడం, దానికి సంబంధించి ఉప్పందడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయగా 80 కోట్ల రూపాయలకు పైగా పంచినట్లు ఆధారాలు లభించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించి ఏకంగా ఆర్కేనగర్ ఉప ఎన్నికలనే రద్దుచేసింది. ఇలా భారీగా డబ్బులు పంచారన్న కారణంతో ఒక ఉప ఎన్నికను రద్దు చేయడం బహుశా ఇదే మొదటిసారి. అప్పుడే దినకరన్ - శశికళ వర్గం తమ పార్టీ వెబ్సైట్లోను, సోషల్ మీడియాలోను రెండాకుల గుర్తును విస్తృతంగా ప్రచారం చేసుకుంది. దానిపై కూడా ఈసీ తీవ్రస్థాయిలో మండిపడింది. అమ్మకు సంబంధించిన గుర్తు తమకు వస్తే తప్ప ఎన్నికల్లో ప్రజలు ఓటేసే అవకాశం లేదని భావించిన దినకరన్.. ఆ గుర్తు కోసం ఏకంగా ఈసీకే లంచం ఇవ్వాలని ప్రయత్నించి అడ్డంగా దొరికేశారు. ఆయనకు సహకరించిన సుఖేష్ కూడా బుక్కయ్యాడు. -
జడ్జి కోసం పరుగో పరుగు
న్యూఢిల్లీ: ఎన్నికల అధికారికి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ లంచం ఇచ్చిన అరెస్ట్ చేసిన మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ ను కోర్టులో హాజరుపరిచేందుకు ఢిల్లీ పోలీసులు శ్రమించాల్సివచ్చింది. న్యాయమూర్తులు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు హైరానా పడ్డారు. సోమవారం సుఖేష్ ను అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీ ప్రొసీడింగ్స్ కోసం పాటియాలా హౌస్ కోర్టు తీసుకొస్తారని భావించారు. అయితే అతడిని టిజ్ హజారీ కోర్టుకు తరలించారు. సోమవారం సాయంత్రం 4.40 గంటలకు అతడిని కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి పోలీసులకు కష్టాలు మొదలయ్యాయి. స్పెషల్ జడ్జి పూనమ్ చౌధరి ముందు హాజరుపరిచేందుకు 25 నంబరు కోర్టు గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ జడ్జి కనబడకపోవడంతో పోలీసులు కంగుతిన్నారు. ఆమె హాఫ్ డే లీవు పెట్టారని తెలుసుకుని మరో ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ముందు హాజరుపరిచేందుకు నిందితుడిని 313 నంబరు కోర్టు రూములోకి తీసుకెళ్లారు. అక్కడ కూడా జడ్జి లేరు. చేసేది లేక నిందితుడితో పాటు 139 నంబరు కోర్టు గదికి వెళ్లారు. అక్కడ కూడా సేమ్ సీన్. ప్రత్యేక న్యాయమూర్తి హేమాని మల్హోత్రా లోకపోవడంతో ఉస్సూరుమన్నారు. ఇక లాభం లేదనుకుని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సతీశ్ కుమార్ అరోరా విధులు నిర్వహిస్తున్న 38 నంబరు కోర్టు రూములోకి ప్రవేశించారు. ఇక్కడ కూడా వారికి చుక్కెదురైంది. అరగంట పాటు తంటాలు పడిన తర్వాత పోలీసులు నిందితుడిని స్పెషల్ జడ్జి పూనమ్ చౌధరి ఇంటికి తీసుకెళ్లి హాజరుపరిచారు. సుఖేష్ ను 8 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ జడ్జి ఆదేశాలివ్వడంతో పోలీసులు ఊపరి పీల్చుకున్నారు. -
సుకేష్.. చాలా సుఖ పురుషుడు!
అది దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్. అందులోని ఓ గదిలో సుకేష్ చంద్రశేఖర్ చాలా తాపీగా కూర్చున్నాడు. అంతలో ఉన్నట్టుండి అక్కడకు పోలీసులు వచ్చారు. వాళ్లు వచ్చే సమయానికి అతడి చేతికి రూ. 6.5 కోట్ల విలువైన బ్రేస్లెట్ ఉంది. దాదాపు 7 లక్షల రూపాయల విలువైన బూట్లు, 1.3 కోట్ల రూపాయల నగదు, ఇంకా చాలా చాలా విలాసవంతమైన వస్తువులున్నాయి. అన్నాడీఎంకే అభ్యర్థిగా ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన టీటీవీ దినకరన్ తరఫున ఎన్నికల కమిషన్‌కు లంచం ఇచ్చేందుకు బెంగళూరుకు చెందిన చంద్రశేఖర్ ఢిల్లీకి వచ్చాడని ఆ తర్వాత విచారణలో తేలింది. తమ పార్టీకి రెండాకుల గుర్తు వచ్చేందుకు 50 కోట్ల వరకు ఇవ్వడానికి తాను సిద్ధమని దినకరన్ చంద్రశేఖరన్‌కు చెప్పినట్లు తెలిసింది. నగరంలో నల్లధనం గురించి తమకు సమాచారం రావడంతో తాము సోదాలు చేసి, చంద్రశేఖర్‌ను అరెస్టు చేశామని, కానీ ఇది ఇంత పెద్ద కేసన్న విషయం ఆ తర్వాత తెలిసిందని పోలీసులు కూడా అంటున్నారు. ఢిల్లీలో పని మొదలుపెట్టడానికి ముందుగా రూ. 10 కోట్లు సుకేష్‌కు ఇచ్చారని సమాచారం. అయితే, ఎన్నికల కమిషన్ అధికారుల వద్దకు ఈ లంచం ప్రతిపాదన ఏమైనా వెళ్లిందా లేదా అనేందుకు మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. ఢిల్లీలో పోలీసులు పట్టుకునేసరికి సుకేష్ లూయిస్ విట్టన్ చెప్పులు వేసుకున్నాడు. అతడి మీద చెన్నై, బెంగళూరు నగరాల్లో 12 కేసులున్నాయి. వాటిలో మోసం, ఫోర్జరీ.. ఇలా రకరకాలవి ఉన్నాయి. ఢిల్లీలో చాలా ఫ్యాన్సీ ఫాంహౌస్‌లు ఉన్నాయి. అతడి నెట్వర్క్ చాలా పెద్దదని, దినకరన్‌కు ఇతడు నాలుగేళ్లుగా తెలుసని పోలీసుల సమాచారం. సుకేష్ చంద్రశేఖర్ ఇంటర్మీడియట్తోనే చదువు ఆపేశాడు. 17 ఏళ్ల యవసులో తొలిసారిగా ఒక స్కాంలో ఇతగాడి పేరు బయటకు వచ్చింది. తన సొంత ఊళ్లో బ్రోకర్‌గా వ్యవహరిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులను అమ్మేసేవాడు. అప్పటికి మైనర్ కావడంతో అరెస్టు చేయలేకపోయారు. కానీ ఏడాది తర్వాత సరిగ్గా అదే పద్ధతిలో చెన్నైలో పెద్ద వ్యవహారం చేస్తూ దొరికేసి, కొన్నాళ్లు జైల్లో ఉండి బెయిల్ తెచ్చుకున్నాడు. తర్వాత ఉత్తరాదికి వ్యాపారాన్ని విస్తరించాడు. నకిలీ బీమా పాలసీలు అమ్ముతూ అతి తక్కువ కాలంలో 3 వేల కోట్లు సంపాదించాడు. తనను తాను ఎంపీగా చెప్పుకోడానికి నకిలీ ఐడీ కార్డులు కూడా వాడేవాడట! అతడి దగ్గర సీజ్ చేసిన ఒక బీఎండబ్ల్యు, ఒక మెర్సిడిస్ కార్ల మీద 'మెంబర్ ఆఫ్ పార్లమెంట్' అనే స్టిక్కర్లు లైసెన్సు ప్లేట్ల మీద ఉన్నాయి. తమిళ నటిని పెళ్లాడి... మద్రాస్ కేఫ్, బిర్యానీ లాంటి సినిమాల్లో నటించిన లీనా మేరీ పాల్‌ను చంద్రశేఖర్ పెళ్లి చేసుకున్నాడు. కానీ, వీళ్లిద్దరినీ 2015 సంవత్సరంలో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కూడా కారణం మోసం చేయడమే. తనకు కేంద్రంలో చాలా మందితో సంబంధాలు ఉన్నాయని, తాను తలచుకుంటే బెంగళూరు జైలు నుంచి శశికళను కూడా బయటకు రప్పించగలనని చెప్పుకొనేవాడట.