సైనికాధికారిణిని బెదిరించిన ఐఎస్‌ఐ ఏజెంట్
Published Tue, Sep 19 2017 4:40 PM | Last Updated on Tue, Sep 19 2017 4:46 PM
న్యూఢిల్లీ: మహిళా సైనికాధికారిని వేధిస్తున్నాడనే ఫిర్యాదుతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడికి పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు తేలటంతో అప్రమత్తమయ్యారు. మహ్మద్ పర్వేజ్(30)అనే వ్యక్తి గత కొంతకాలంగా కల్నల్ స్థాయి అధికారిణికి మార్ఫింగ్ చేసిన అసభ్యకర ఫొటోలను పంపిస్తున్నాడు. బాధిత అధికారిణి సెల్‌ఫోన్ వాట్సాప్‌కు రెండు వేర్వేరు నంబర్లతో పంపిస్తున్నాడు. తనతో మాట్లాడకుంటే వాటిని సోషల్ మీడియాలో ఉంచుతానని బెదిరించాడు.
దీంతో ఆమె ఆ రెండు నంబర్లను బ్లాక్‌లో పెట్టింది. అయితే, ఆ వ్యక్తి బాధితురాలి కుమార్తె సెల్‌కు అసభ్యకర మెసేజ్‌లు, మార్ఫింగ్ ఫొటోలు పంపటం మొదలుపెట్టాడు. బెదిరింపులు తీవ్రం కావడంతో బాధితురాలు ఈ నెల 13వ తేదీన ద్వారక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఫేస్‌బుక్ ప్రొఫైల్, రెండు సిమ్‌ల ఆధారంగా పర్వేజ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా పలుమార్లు పాకిస్తాన్‌కు వెళ్లివచ్చినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక విభాగానికి ఈ కేసును అప్పగించారు.
ప్రత్యేక విభాగం అధికారులు అతడిని విచారించగా.. పలు దఫాలుగా పాకిస్తాన్ వెళ్లివచ్చానని, కొన్ని సిమ్ కార్డులను పాకిస్తానీయులకు కూడా ఇచ్చానని అంగీకరించాడు. దీంతో అతడికి గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయని భావిస్తున్నారు. సైనిక సంబంధ సమాచారం రాబట్టడానికే మహిళా సైనికాధికారిణిని బెదిరింపులకు గురి చేశాడని అనుమానిస్తున్నారు. దీనిపై మరింత పక్కాగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement