ఢిల్లీలో ‘కరెంటు’ మంటలు!
- ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్, సతీశ్ ఉపాధ్యాయ మాటల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి! ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థుల మధ్య ‘కరెంటు’ మంటలు లేచాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి విద్యుత్ కంపెనీలతో సంబంధాలున్నాయని.. ఇదిగో సాక్ష్యాలంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఆ ఆరోపణలను రుజువు చేస్తే తాము రాజకీయ సన్యాసం చేస్తామని, లేకుంటే కేజ్రీవాల్ రాజకీయాలు వదిలి వెళ్లిపోవాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీశ్ ఉపాధ్యాయ సవాల్ విసిరారు. బుధవారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉపాధ్యాయకు ఢిల్లీలో విద్యుత్ మీటర్లు అమర్చే, రిపేర్ చేసే కంపెనీతో పాటు ఆరు కంపెనీలు ఉన్నాయి. అవన్నీ విద్యుత్ డిస్కంలతో కలిసి పనిచేస్తున్నాయి.
ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆశీష్ సూద్ కూడా ఉపాధ్యాయకు చెందిన ఓ కంపెనీలో గతేడాది వరకు డెరైక్టర్‌గా ఉన్నారు’’ అని చెప్పారు. వారికి విద్యుత్ కంపెనీలతో సంబంధాలున్నాయని తెలిసి కూడా బీజేపీ వారికి పదవులు కట్టబెట్టిందన్నారు. ఇది ప్రజా ప్రయోజనాలను దెబ్బతీయడమేనన్నారు. ఎన్‌సీఎన్‌ఎల్ ఇన్ఫోమీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఎన్‌సీఎన్‌ఎల్ పవర్ లిమిటెడ్ కంపెనీలు ఉపాధ్యాయకు చెందినవేనని, ఈ రెండు కంపెనీలు ఇప్పుడు మాయమయ్యాయని, వాటికి రిలయెన్స్, బీఎస్‌ఈఎస్ భారీ మొత్తంలో చె ల్లింపులు చేశాయని ఆరోపించారు. గతకొద్ది నెలలుగా బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ మండిపడ్డారు.
ఆ ఆరోపణలు నిరాధారం: సతీశ్
విద్యుత్ కంపెనీలతో తనకు సంబంధాలున్నాయనే ఆరోపణలను సతీశ్ ఉపాధ్యాయ ఖండించారు. తాను ఉపాధి కోసం వ్యాపారం చేస్తానని, ఇందులో తప్పేం లేదని పేర్కొన్నారు. కేజ్రీవాల్ తనపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేకుంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
దక్షిణాది సమస్యలపై దృష్టి: యోగేంద్ర
దేశరాజధానిలోని వివిధ ప్రాంతాల్లో నివిసిస్తున్న దక్షి ణాది రాష్ట్రాల ప్రజల ఇబ్బందుల పరిష్కారంపై ఆప్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని ఆ పార్టీ నాయకుడు యోగేంద్రయాదవ్ అన్నారు. తమది కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ దృక్పథం కలిగిన కలిగిన పార్టీ అని ప్రాంతాల వారీగా ఎజెండాలు ఉండవన్నారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు మీడియాతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఢిల్లీలో ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది మురికి వాడల్లో దుర్బర జీవితం గడుపుతున్నా గత ప్రభుత్వాలు వారి సమస్యలను పట్టించుకోలేదన్నారు. ‘మిషన్ విస్తార్’ పేరిట ఆప్ అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.