ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు? | Delhi set for re-poll: BJP, AAP not ready to form Govt | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు?

Published Tue, Dec 10 2013 12:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు? - Sakshi

ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు?

 సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రపతి పాలన దిశగా పయనిస్తోంది. ఆదివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితా ల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని విషయం తెలి సిందే. తమకు మెజారిటీ లేనందున ప్రభుత్వం ఏర్పాటు చేయబోమంటూ ఇటు బీజేపీ, అటు అరంగేట్రంలోనే అదరగొట్టే ఫలి తాలు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ తేల్చిచెబుతున్నాయి. దాం తో అసెంబ్లీని రద్దు చేయడమో సుప్త చేతనావస్థలో ఉంచడమో చేసి, రాష్ట్రపతి పాలన విధించి ఆర్నెల్లలోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించటం తప్పదని రాజకీయ పరిశీల కులు అంచ నా వేస్తున్నారు. అధికార కాంగ్రెస్ కేవలం 8 సీట్లకే పరిమితమవగా, 31 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిం ది. ఆప్ 28 సీట్లతో రెండో పెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షమైన అకాలీదళ్‌కు వచ్చిన ఒక్క సీటును కలుపుకున్నా బీజేపీ బలం 32 అవుతుంది. 70 స్థానాల అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 36 సీట్లు అవసరం. ఈ మూడు పార్టీల్లో ఏవో రెండు కలిస్తే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి. దాంతో ఢిల్లీలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ పాత్ర కీలకంగా మారడంతో అందరి దృష్టీ ఆయనపైనే కేంద్రీకృతమైంది.
 
 రెండూ కాదంటే రాష్ట్రపతి పాలనే
 రాజ్యాంగ నిపుణులు చెబుతున్న మేరకు హంగ్ ఏర్పడ్డప్పుడు సంప్రదాయం ప్రకారం అతి పెద్ద పార్టీ అయిన బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. బీజేపీ నిరాకరిస్తే రెండో పెద్ద పార్టీ ఆప్‌ను ఆహ్వానిస్తారు. ఆ పార్టీ కూడా తిరస్కరిస్తే రెండు పార్టీల సభాపక్ష నేతలతో వ్యక్తిగతంగా మాట్లాడతారు.అనంతరం రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తూ, భావి కార్యాచరణ కోసం కేంద్ర హోంశాఖకు నివేదిక పంపుతారు. రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేస్తే ఆ విషయాన్ని కేంద్ర కేబినెట్‌కు హోంశాఖ పంపిస్తుంది. ఆ సూచనతో కేంద్ర మంత్రివర్గం ఏకీభవిస్తే అసెంబ్లీనిసుప్త చేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేస్తుంది. అప్పుడు ‘సభను సుప్త చేతనావస్థలో ఉంచటమో, రద్దు చేయడమో చేయవచ్చు’ అని ఢిల్లీ శాసనసభ మాజీ కార్యదర్శి ఎస్.కె.శర్మ పేర్కొన్నారు. సుప్త చేతనావస్థలో ఉంచితే ఏదో ఒక పార్టీ ఇతర పార్టీతో జట్టుకట్టో, మరోలాగో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి అవకాశం సజీవంగా ఉంటుంది. రాష్ట్రపతి పాలనే విధిస్తేమళ్లీ ఎన్నికలు నిర్వహించి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకూ ఆరు నెలల పాటు కార్యనిర్వాహక అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతికి వెళ్తాయి. అసెంబ్లీని రద్దు చేస్తే మరో ఆరు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు దానికి తిరిగి ఎన్నికలు జరగవచ్చు. రాష్ట్రపతి పాలనపై లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వ ఏర్పాటుకు గల అన్ని అవకాశాలనూ పరిశీలిస్తారని కేంద్ర హోంమంత్రి షిండే పేర్కొన్నారు.
 
 గవర్నర్ పిలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేయం: ఆప్
 
 ప్రభుత్వ ఏర్పాటుకు కేజ్రీవాల్ ససేమిరా అంటున్నారు. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వబోమని, ఎవరి నుంచీ మద్దతు తీసుకోబోమని స్పష్టం చేస్తున్నారు. ఆప్ మద్దతు స్వీకరించటానికి బీజేపీ, ఆప్‌కే మద్దతివ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్టు సంకేతాలొస్తున్నా ఆ పార్టీ అందుకు నిరాకరిస్తోంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రానపుడు మళ్లీ ఎన్నికలకు వెళ్లటానికే తాము మొగ్గు చూపుతామని కేజ్రీవాల్ స్పష్టంచేస్తున్నారు. ఢిల్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడం కోసంతాము సిద్ధంగా ఉన్నామని ఆప్ నేత యోగేంద్రయాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పా టు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమను ఆహ్వానిస్తే తాము తిరస్కరిస్తామని స్పష్టంచేశారు. సోమవారం ఘజియాబాద్‌లోని కేజ్రీవాల్ నివాసంలో పార్టీ కోర్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం యోగేంద్రయాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. తమకు ప్రభుత్వం ఏర్పాటుచేయటానికి కావలసిన మెజారిటీ రాలేదన్నారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోగా.. రెండో స్థానంలో ఉన్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఇదిలావుంటే.. ఏవైనా ఇతర పార్టీలు మద్దతు కోసం ప్రలోభపెడుతూ సంప్రదించినట్లయితే వెంటనే తనకు తెలియజేయాలని కేజ్రీవాల్.. తన పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులందరికీ సూచించినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ఎలాంటి ప్రలోభాలకూ లొంగొద్దని తమ ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
 
 ఢిల్లీ ప్రజలు బీజేపీ, ఆప్‌లకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని.. కాబట్టి ఆ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయాలని.. మళ్లీ ఎన్నికలు అంటే ప్రజలపై భారం మోపటమేనని.. సామాజిక ఉద్యమ నేత కిరణ్‌బేడీ ట్విటర్‌లో సూచించారు. మరో సీనియర్ నేత రామ్‌జెఠ్మలానీ కూడా రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని సూచన చేశారు. వాటిని ఆప్ తోసిపుచ్చింది.
 
 బీజేపీ... ఆచితూచి...
 బీజేపీ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రజల తీర్పును గౌరవిస్తామని, ప్రభుత్వ ఏర్పాటుకు తొందరపడబోమని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించటం, కొనుగోలు చేయటం వంటి అనైతిక చర్యలకు పాల్పడబోమని చెబుతోంది. ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతామంటోంది. సహజ ప్రక్రియలో మెజారిటీ వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, లేదంటే ప్రతిపక్షంలో కూర్చుంటామని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విజయ్ గోయల్ పేర్కొన్నారు. మెజారిటీ లేనందువల్ల తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకు వెళ్లబోమని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ కూడా అన్నారు.
 
 మైనారిటీ సర్కారు ఏర్పాటు చేస్తే..!
 లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానం మేరకు బీజేపీ, ఆప్‌లలో ఏ పార్టీ అయినా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నిర్ణీత గడువులోపు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవలసి ఉంటుంది. అందుకు దానికి ఏదో ఒక పార్టీ మద్దతన్నా ఇవ్వాలి, లేదంటే ఓటింగ్‌కు గైర్హాజరైనా కావాలి. 32 మంది సభ్యులున్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం మరో నలుగురు ఎమ్మెల్యేలు కావాలి. 28 మంది సభ్యులున్న ఆప్ మద్దతు ఇవ్వటానికి నిరాకరించింది. 8 మంది సభ్యులున్న కాంగ్రెస్ ఎటూ ఇవ్వదు. గెలిచిన మరో ఇద్దరిలో షోయబ్ ఇక్బాల్ (జేడీయూ) బీజేపీకి మద్దతివ్వడానికి నిరాకరించారు. స్వతంత్ర ఎమ్మెల్యే రాంబీర్ షౌకీన్ మాత్రం తనను డిప్యూటీ సీఎం చేస్తే బీజేపీకి మద్దతిస్తానని ప్రకటించారు. అయితే నరేంద్రమోడీ స్వయంగా కోరితే బేషరతుగా మద్దతిస్తానన్నారు. ఒకవేళ 8 మంది సభ్యుల్లో కొందరు చీలిపోయి ఆప్, బీజేపీల్లో ఏదో ఒకదానికి మద్దతివ్వాలన్నా ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటును తప్పించుకోవాలంటే కనీసం ఆరుగురు సభ్యులు చీలిపోవాల్సి ఉంటుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 8 మంది సభ్యుల మద్దతు అవసరం. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా తీసుకునేది లేదని ఆ పార్టీ స్పష్టం చేస్తుండటంతో ఆ అవకాశమే లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement