వారణాసిలో ప్రచారంలో బిజీగా ఉన్న ఆప్ నేత కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ వారణాసిపై దృష్టిపెట్టడంతో ఢిల్లీలో ఆయన గైర్హాజరీని తమకు అనుకూలంగా మలచుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ఎంతోకాలంగా తమకు సంప్రదాయ ఓటుబ్యాంక్‌గా ఉన్న కొన్ని వర్గాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలబడటంపై ఆ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
అయితే ఈసారి ఎన్నికల సమయంలో వారిని తిరిగి తనవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రూపొందించాయి. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరుగా ఊపందుకుంది. అన్ని పార్టీల అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాలలో ప్రచారం చేస్తున్నారు. రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించడానికి బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌లు ప్రయత్నిస్తున్నాయి. ఆప్ అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచా రం జోరు పెంచినప్పటికీ కేజ్రీవాల్ లేని లోటు కనబడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటర్లు కేజ్రీవాల్‌ను చూసే ఓటు వేశారన్నది కాదనలేని సత్యం. ఆప్ అభ్యర్థులెవరో తెలియకపోయినా కేజ్రీవాల్ మీదున్న నమ్మకంతో ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడాయన ఢిల్లీ రాజకీయాల నుంచి బయటపడి దేశ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో స్థానికంగా ఆయన లోటు అడుగడుగునా కనబడుతోంది.
ఇదే తమకు అనుకూలమైన సమయమని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. 49 రోజుల ఆప్ పాలనతో నిరాశకు గురైన మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకోవడంపై బీజేపీ దృష్టి సారించగా పేద, ముస్లిం, దళిత, అనధికార కాలనీ ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఎక్కువగా నష్టపోయింది తామే కాబట్టి ఆయన లేని లోటు వల్ల ప్రయోజనాన్ని కూడా తామే పూర్తిగా పొందాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వాతావరణం తమకు అనుకూలంగా లేనప్పటికీ సంప్రదాయ ఓటర్లను తమవైపుకు ఆకర్షించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గత బుధవారం నరేంద్ర మోడీ ర్యాలీ బీజేపీ కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నిం పిం ది. కాగా, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ర్యాలీల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.
రోడ్డున పడిన కట్‌పుత్లీ వాసులు: ఆప్
కట్‌పుత్లీ ప్రాంతంలో ఒక ప్రైవేట్ బిల్డర్‌కు తక్కువ ధరకే భూమిని అమ్మి కాంగ్రెస్ స్థానికుల జీవితాల ను నరకప్రాయం చేసేందుకు యత్నిస్తోందని బుధవారం ఆప్ నాయకులు ఆరోపించారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడుతున్న ఆశిష్ ఖేతన్ మీడియాతో మాట్లాడుతూ రహేజా డెవలపర్స్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం పునరావాసం కింద సుమారు రూ.1,000 కోట్ల విలువచేసే స్థలాన్ని కేవలం రూ.6 కోట్లకు అమ్మిందని ఆరోపించారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ప్రస్తుత న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి అయిన అజయ్ మాకెన్ ప్రోద్బలంతోనే ఈ కుంభకోణం జరిగిందని ఆయన విమర్శిం చారు. కాలనీలో నివాసముంటున్న సుమారు 3,500 కుటుంబాలను తగిన సమయం ఇవ్వకుండా నే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆశిష్ ఆరోపించారు.