ఢిల్లీలో 'చెల్లాయికి మళ్లీ మళ్లీ పెళ్లి'?
'చెల్లాయికి మళ్లీ మళ్లీ పెళ్లి' అన్నట్టు ఢిల్లీలో మళ్లీ కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతోందా? ఇప్పట్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఉన్నది కాస్తా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఇరు పార్టీలూ భావిస్తున్నాయి. కాబట్టి ఎన్నికలను వీలైనంత ఆలస్యం చేస్తే, బిజెపికి ప్రజాదరణ కాస్త తగ్గే అవకాశం ఉందని, అప్పుడు ఎన్నికలు జరిపితే ఫలితాలు బాగుంటాయని ఇరు పార్టీలూ భావిస్తున్నాయి. అందుకే ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, కాలం వెళ్లదీయాలన్న నిర్ణయానికి ఇరు పార్టీలూ వచ్చాయని తెలుస్తోంది.
అటు కాంగ్రెస్ కి, ఇటు ఆప్ కి కనీసం ఊరటనిచ్చే ఒక్క గెలుపు కావాలి. లేకపోతే ఆప్ పూర్తిగా సమాధి స్థితిలోకి వెళ్తుంది. మూలిగే కాంగ్రెస్ పై మరో తాటికాయ పడుతుంది. అందుకే ఇరు పార్టీలూ చెరికాస్త పవర్ ను పంచుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ మేరకు ఆప్ నేతలు కొందరు సీక్రెట్ గా కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారని, ఆమ్ ఆద్మీ రాజకీయ కన్ను గీటుకు, గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాలి బొటనవేలు నేలకు రాసి, సిగ్గు సిగ్గుగా ఓకే అంటోందని కథనం.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో బిజెపికి 31, ఆప్ కి 28, కాంగ్రెస్ కి 8 సీట్లు వచ్చాయి. ఆప్, కాంగ్రెస్ లు కలిపి కాపురమైతే పెట్టాయి కానీ పొత్తు ఎక్కువకాలం పొసగలేదు. 49 రోజులకే ఆప్ నేత, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. దీనితో అసెంబ్లీ ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉంది.
ఇప్పుడు మళ్లీ ఈ రెండు పార్టీలూ కలిసేందుకు దాదాపుగా రంగం సిద్ధమైందని, బిజెపి ఊపు తగ్గేదాకా కలిసుంటేనే కలదు సుఖం అని ఇరు పార్టీలూ భావిస్తున్నాయని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ మంత్రాంగం ఫలిస్తుందా? మంత్రి వర్గం ఏర్పడుతుందా? ఇదంతా రాబోయే రోజుల్లో ఢిల్లీ రాజకీయ వెండి తెరపై చూడాల్సిందే మరి.