ఢిల్లీ లో త్రిశంకు సభ
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు జరిపిన పలు ప్రజాభిప్రాయసేకరణల్లో వెల్లడైన విధంగానే ఢిల్లీ ఓటర్లు ‘త్రిశంకు’ తీర్పునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికలతో అరంగేట్రం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలి యత్నంలోనే 28 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 36 స్థానాలు అవసరం కాగా, బీజేపీకి 31 స్థానాలు మాత్రమే లభించాయి. మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌కు ఒక స్థానం దక్కింది. అంటే, ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ నాలుగు స్థానాల దూరంలో మిగిలింది. వరుసగా మూడు పర్యాయాలు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ఈసారి అత్యంత దయనీయంగా 8 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ‘ఆప్’ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో 25,864 ఓట్ల భారీ తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూశారు. ఆమె కేబినెట్‌లోని పలువురు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ సైతం ప్రత్యర్థుల చేతిలో మట్టికరిచారు. ఫలితాల తీరు గమనించిన షీలా దీక్షిత్ ఆదివారం మధ్యాహ్నమే లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు రాజీనామా సమర్పించారు. మరోవైపు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి ఏకంగా 43,150 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు.
‘త్రిశంకు’ తీర్పుతో సర్కారు ఏర్పాటుపై ప్రశ్నలు...: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిశంకు ఫలితాలు వెలువడటంతో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను కోరేందుకు అవకాశం ఉంది. లేదా గవర్నర్ ఆహ్వానించేంత వరకు వేచి చూసే అవకాశాలూ ఉన్నాయి. అయితే, నిర్ణీత గడువులోగా బల నిరూపణ కోసం గవర్నర్ బీజేపీకి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఫలితాల ప్రకారం కాంగ్రెస్ లేదా ‘ఆప్’ నుంచి ఫిరాయింపులు లేనిదే మెజారిటీని రుజువు చేసుకోవడం బీజేపీకి సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. తమకు తగినంత సంఖ్యాబలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని తనంతట తానుగా కోరలేనని, అయితే, ఏం జరుగుతుందో తనకు తెలియదని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ అన్నారు. ఎవరైనా తమంతట తాముగా తమ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మద్దతు కూడగట్టుకునేందుకు అడ్డదారులు తొక్కబోమని, అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చూనేందుకైనా సిద్ధపడతామని బీజేపీ ఢిల్లీ వ్యవహారాల ఇన్‌చార్జి నితిన్ గడ్కరీ చెప్పారు. అయితే, కాంగ్రెస్ మాత్రం తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమని, ‘ఆప్’కు తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ ప్రకటించారు.