రద్దయిన పెద్ద నోట్లను ఏం చేస్తున్నారు?
దుబాయ్: దేశంలో రద్దు చేసిన పెద్ద నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? మంటల్లో తగులబెడుతుందా, సముద్రంలో పారేస్తుందా? అని అందరీకీ సందేహాలు కలిగిన విషయం తెల్సిందే. అయితే, ఈ రద్దు చేసిన రూ.500, రూ.1000 రూపాయల నోట్లను ఏం చేయబోతున్నారో తెలిసిపోయింది. వాటిని ఫర్నీచర్ రీసైక్లింగ్ కోసం కేరళలోని కన్నూర్ జిల్లాలోవున్న ‘వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్స్’కు విక్రయిస్తోంది.
ఈ విషయాన్ని కంపెనీ పనిమీద దుబాయ్‌కి వచ్చిన యజమాని పీకే మాయన్ మొహమ్మద్ ఇక్కడ మీడియాకు తెలియజేశారు. వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్స్ కంపెనీ పాత బిల్లు కాగితాలను రీసైక్లింగ్ చేసి హార్డ్‌బోర్డ్, ఫైబర్‌బోర్డ్ పర్నీచర్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. వాటిని దుబాయ్ గుండా యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోని పాతిక దేశాలకు విక్రయిస్తోంది. తాము కాగితం రీసైక్లింగ్ ద్వారా చేసే పుస్తకాల సెల్ఫ్‌లు, దుస్తుల కంబోర్డులు, టేబుల్ డ్రాయర్లు అందంగా ఉండడమే కాకుండా నాణ్యతతో ఉంటాయని మాయన్ తెలిపారు.
ఆయన కథనం ప్రకారం అక్టోబర్ 20వ తేదీన, అంటే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించడానికి సరిగ్గా 18 రోజుల ముందు తిరువనంతపురంకు చెందిన ఆర్బీఐ అధికారులు ఆయన వద్దకు వచ్చి చెల్లని నోట్లను రీసైక్లింగ్ చేయవచ్చా? అంటూ వాకబు చేశారు. ఆయన తన కంపెనీ గురించి పూర్తి వివరాలను తెలియజేసి ట్రయల్ రన్ కింద చెల్లని నోట్లను తీసుకరమ్మని చెప్పారు. 500, 1000 రూపాయల నోట్లు రెండు ట్రక్కుల నిండారాగా వాటిని మామూలు పద్ధతిలో రద్దీగా మార్చేందుకు ప్రయత్నించారు. ఆ పద్ధతి వల్ల ఆశించిన ఫలితం రాకపోవడంతో ‘థర్మోమెకానికల్ పల్పింగ్ మెథడ్’ ఉపయోగించి వాటిని రద్దీగా మార్చారు.
అత్యధిక ఉష్ణోగ్రత, విద్యుత్‌ను ఉపయోగించి నోట్లను రీసైక్లింగ్ చేసే ఈ పద్ధతి భారతదేశంలో ఒక్క తన కంపెనీలో ఉందని మాయన్ తెలిపారు. ఆర్బీఐ అధికారులు తన వద్దకు వచ్చి సంప్రదించే వరకు కూడా పెద్ద నోట్లను రద్దు చేస్తున్న విషయం తనకు తెలియదని, మోదీ ప్రకటన ద్వారానే దేశ ప్రజలతోపాటు తనకూ తెల్సిందని మీడియా ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఆర్బీఐ నుంచి మెట్రిక్ టన్ను రద్దయిన నోట్లను 250 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నానని, నెలకు 60 మెట్రిక్ టన్నుల నోట్లను రీసైక్లింగ్ చేసే సామర్థ్యం తమ కుందని ఆయన తెలిపారు. గత మార్చి నెల నాటికి 2,200 కోట్ల పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ లెక్కలు తెలియజేస్తున్నాయి.
వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్ కంపెనీ ఫర్నీచర్ ఉత్పత్తులో పది శాతం దేశీయంగా అమ్ముడుపోతున్నాయి. అంటే, ఏదోరోజు మన ఇంటికి కూడా రద్దయిన పెద్ద నోట్లు ఫర్నీచర్ రూపంలో రావచ్చు.