96 శాతం మార్కులొచ్చినా ఉద్యోగం ఇవ్వలేదు
మోదీ జోక్యం కోరుతున్న ఓ అభ్యర్థి
న్యూఢిల్లీ: రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలో 96 శాతం మార్కులు సాధించినప్పటికీ ఉద్యోగం రాకపోడంతో హతాశుడైన ఓ యువకుడు తనకు న్యాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని కోరాడు. ఢిల్లీకి చెందిన లలిత్ కుమార్ 2013 డిసెంబర్లో నార్తర్న్ గ్రూప్-డి పరీక్ష రాశాడు. బాగా రాసినప్పటికీ ఉద్యోగానికి ఎంపిక కాకపోవడంతో అనుమానం వచ్చిన అతడు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించాడు. ఏడాది తర్వాత సమాధానం వచ్చింది.
అక్రమ పద్ధతులతో మార్కులు సాధించినందున అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లు అందులో పేర్కొన్నారు. దీంతో అతను కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)ను ఆశ్రయించాడు. లలిత్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణాలను 30 రోజుల్లోగా తెలపాలంటూ నార్తర్న్ రైల్వేకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారిని సీఐసీ గత ఆగస్టు 10న ఆదేశించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాసినట్లు తెలిపాడు.