- శివరామకృష్ణ మోసాలు మరిన్ని....
- సూత్రధారి సికిందరాబాద్ వర్కు షెడ్డు ఉద్యోగి
- ఒక్కొక్కరి నుంచి ఐదు నుంచి రూ.12 లక్షలు వసూలు
- రోజు రోజుకీ పెరుగుతున్న బాధితులు
పెడన : రైల్వేలో టీటీఈ పోస్టులు ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రుపాయలు వసూలు చేసి పరారయిన జన్ను శివ రామకృష్ణ మోసాల వెనుక సికిందరాబాద్‌కు చెందిన రైల్వే ఉద్యోగి హస్తం ఉన్నట్లు సమాచారం. పెడన మండలం అచ్చయ్యవారి పాలెం గ్రామ పంచాయతీ శివారు జింజేరు గౌడపాలెంనకు చెందిన జన్ను శివరామకృష్ణకు రైల్వేలో ఉన్నత ఉద్యోగుల అండదండలు, పరిచయాలతోనే ఈ తంతు గుట్టు చప్పుడు కాకుండా నడిపినట్లు సమాచారం. ఉయ్యూరు మండలం ఆనందపురానికి చెందిన పర్రే సతీష్ బాబు, మల్లంపాటీ పూర్ణ కిషోర్, రమ్య ఇచ్చిన ఫిర్యాదుతో పెడన పోలీసులు రంగంలోకి దిగారు. రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని మోసంచేసిన శివరామకృష్ణ భాాగోతాన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.
వర్కు షెడ్డులో ఉన్నతోద్యోగి హస్తం !
జన్ను శివరామకృష్ణ భీమవరంలో బీఎస్సీ వరకు చదువుకుని రైల్వేలో టీటీఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పరీక్షలు రాసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతలో సికిందరాబాద్‌లోని వర్కు షెడ్డులో పనిచేసే ఓ ఉన్నతోద్యోగి పరిచయం ఏర్పడి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కొంత నగదును శివరామకృష్ణ నుంచి వసూలు చేశాడు. వర్కుషెడ్డులో అప్రంటీస్ షిప్ కింద శివరామకృష్ణను చేర్చాడు. ఇదే తరహాలోమరికొంతమందికి ఉద్యోగాలిప్పించి వారినుంచి భారీమొత్తంలో గుంజాలని శివరామకృష్ణ, రైల్వే ఉద్యోగి పన్నాగం పన్నారు.
రైల్వేలో ఉద్యోగాల భర్తీ కోసం పడుతున్న పలు రిక్రూట్‌మెంటు వివరాలను తెలుసుకుని నిరుద్యోగులకు ఎర వేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో బీటెక్, డీగ్రీలు, పీజీలు చదివిన పలువురు నిరుద్యోగుల నుంచి ఆరు లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలో బంటుమిల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి శివరామకృష్ణ మోసంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
సొంత బంధువులు సైతం బురిడీ...
శివరామకృష్ణ భార్య వాళ్ల పెద్దమ్మ నుంచి వాళ్ల అబ్బాయికి టీటీఈ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. ఆరు లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. వీరితో పాటు భీమవరం, హైదారాబాద్, బంటుమిల్లి, గుడివాడ, పెనమలూరు తదితర ప్రాంతాలకు చెందిన 40 మంది పేర్లను వెల్లడించినట్లు తెలిసింది.
మరో నలుగురు బాధితుల ఫిర్యాదు...
పలు పత్రికల్లో వచ్చిన కథనాలను చూసిన గుడ్లవల్లేరు మండలం పురిటిపాడుకు చెందిన వీరంకి కృష్ణ మోహన్, పరిశే వీర వేంకటేశ్వరావు, బొర్రా నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఒక్కొక్కరినుంచి పది లక్షలు చొప్పున రూ. 30 లక్షలు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే పెడన మండలం నెరికేపాలేం గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగి నుంచి రూ.ఐదు లక్షలు తీసుకున్నట్లు మరో ఫిర్యాదు అందింది.