Railway job
-
చర్మం ఒలిచినా దక్కని ఫలితం
వడోదర: రైల్వే ఉద్యోగం సాధించేందుకు ఓ యువకుడు చేసిన తెగింపు యత్నం బెడిసికొట్టింది. తన బొటన వేలి చర్మాన్ని ఒలిచి స్నేహితుడి వేలికి అతికించి, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌లో బయటపడ్డాక తనకు బదులుగా పరీక్ష రాయించాలని పథకం వేశాడు. అయితే, బండారం బయటపడి ఇద్దరూ కటకటాల పాలయ్యారు. బిహార్‌లోని ముంగేర్ జిల్లాకు చెందిన మనీష్ కుమార్, రాజ్యగురు గుప్తా స్నేహితులు. 12వ తరగతి వరకు చదువుకున్నారు. రైల్వే శాఖలోని గ్రూప్ డి ఉద్యోగాలకు మనీష్ దరఖాస్తు చేసుకున్నాడు. ఎంపిక పరీక్ష వడోదరలో ఆదివారం జరిగింది. మనీష్ బదులు చదువులో ఎప్పుడూ ముందుండే గుప్తా పరీక్షకు వచ్చాడు. అభ్యర్థులకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ గండం గట్టెక్కేందుకు మనీష్ తన బొటనవేలి చర్మాన్ని ఒలిచి గుప్తా చేతి వేలికి అతికించాడు. గుప్తా ఆ చేతిని ప్యాంట్ జేబులోనే ఉంచుకుని, మరో చేతి వేలితో చేసిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ యత్నం పలుమార్లు విఫలమైంది. అనుమానించిన అధికారులు అతడి మరో చేతిని బయటకు తీయించి, శానిటైజర్ స్ప్రే చేశారు. బొటనవేలికి అతికించిన చర్మ ఊడి కింద పడింది. అధికారుల విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. దీంతో ఇద్దరు మిత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షకు ముందు బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను ఊహించిన కుమార్..పరీక్షకు ముందు రోజే ఎడమ బొటనవేలిని స్టౌపైన కాల్చుకుని, బ్లేడుతో ఆ చర్మాన్ని ఒలిచి గుప్తా బొటనవేలికి అంటించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఒకవేళ, అతికించిన చర్మం ఊడి రాకున్నా వారి పన్నాగం పారేది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. -
రైల్వేలో డీఈ, ఆపై జాయింట్ కలెక్టర్.. కట్ చేస్తే!
సాక్షి, మంచిర్యాలక్రైం: నకిలీ ఐఏఎస్ బర్ల లక్ష్మినారాయణ మోసాలు.. అక్రమాలకు అంతులేకుండా సాగింది. తక్కువ సమయంలో.. ఎక్కువ డబ్బు, హోదా సంపాదించాలన్న అతడి దురాశ.. తన తల్లిదండ్రులనే మోసం చేయించింది. తన మాటలకు కన్నవారు మోసపోయారు..! ఇక ఇతరులు మోసపోరా..? అనుకున్నాడో ఏమోగాని.. వెంటనే తన పథకాన్ని అమల్లోకి తెచ్చి చివరకు కటకటాల పాలయ్యాడు. ఈనెల 12న వెలుగులోకి వచ్చిన నకిలీ ఐఏఎస్ బర్ల లక్ష్మీనారాయణ (22) మంచిర్యాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతడి వివరాలను స్థానిక డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన బర్ల శంకరయ్య కుమారుడు లక్ష్మీనారాయణ హైదరాబాద్‌లోని సిద్దార్థ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుండగా.. పాకెట్ మనీ కోసం సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఎస్బీఐ కార్డ్స్ డివిజన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. అదే సమయంలో రైల్వేలో ఉద్యోగం కోసం పరీక్ష రాశాడు. తాను పరీక్షలో పాసయ్యాయనని, రైల్వేలో డీఈగా ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులను నమ్మించాడు. లక్ష్మినారాయణ చిన్నతనంలోనే మంచి ఉద్యోగం సాధించాడని పేర్కొంటూ గ్రామస్తులు, బంధువులు ఘనంగా సన్మానం కూడా చేశారు. తల్లిదండ్రులతో ఓ బ్రీజా కారు కొనిపించుకున్నాడు. అప్పటినుంచి జల్సాలకు అలవాటు పడ్డాడు. తల్లి దండ్రులను ఈజీగా నమ్మించి మోసం చేసిన లక్ష్మినారాయణ.. ఇలాగే ప్రజలను కూడా మోసం చేయొచ్చని భావించాడు. అప్పటినుంచే మోసాలకు తెరలేపాడు. ఏకంగా తాను ఐఏఎస్ అయ్యానని, జాయింట్ కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చిందని నమ్మించాడు. మంచిర్యాల జేసీగా ప్రచారం.. తనకు రైల్వేలో ఉద్యోగం వచ్చిందని, మంచిర్యాల రైల్వేస్టేషన్లో డీఈగా పని చేస్తున్నానని నమ్మించాడు. తన కారుకు బీర్పూర్కు చెందిన తాళ్లపెల్లి రమేష్‌ను డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. అతడికి నెలకు రూ.25వేలు వేతనంగా చెల్లించాడు. తాను సివిల్స్ పరీక్ష రాశానని, త్వరలోనే రిజల్ట్ వస్తుందని చెప్పాడు. 2020 డిసెంబర్లో తాను ఐఏఎస్‌గా సెలక్ట్ అయ్యానని, మంచిర్యాల జేసీగా పోస్టింగ్ ఇచ్చారని నమ్మ బలికాడు. దీంతో తన మకాం మంచిర్యాలకు మార్చాడు. జిల్లాకేంద్రంలోని ఆదిత్య ఎన్‌క్లేవ్స్‌లో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగాడు. డ్రైవర్ రమేష్‌ను పర్మినెంట్ చేస్తానని చెప్పి అతడి నుంచి రూ.3 లక్షలు వసూలు చేశాడు. అప్పటి నుంచి రమేష్‌కు రూ.నెలకు 45వేల జీతం ఇచ్చాడు. రమేష్‌కు తెలిసిన మరో స్నేహితుడు దండేపల్లి మండలం రెబ్బెనపెల్లికి చెందిన మహేందర్‌ను పీఏ (పర్సనల్ అసిస్టెంట్)గా నియమించుకున్నాడు. రమేష్, మహేందర్‌లు తాము కలెక్టర్ వద్ద పనిచేస్తున్నామని గర్వంగా తమతమ ఊళ్లో చెప్పుకున్నారు. ఓ రోజు రమేష్, మహేందర్‌తో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తాను ఐఏఎస్ అయినందున పర్సనల్ కోటా కింద 30మంది వరకు ఉద్యోగాలు ఇప్పించే అవకాశం ఉంటుందని, ఎవరైనా ఉద్యోగం కోసం వస్తే తనవద్దకు పంపాలని నమ్మించాడు. ఆయన మాటలు నమ్మిన రమేశ్, మహేందర్ తమకు తెలిసిన వారికి ఈ విషయం చెప్పడంతో చాలామంది లక్ష్మినారాయణను ఆశ్రయించారు. వీరిలో కొందరి సర్టిఫికెట్లు పరిశీలించి.. కొంత ఖర్చు అవుతుందని చెప్పి సుమారు 29మంది నుంచి రూ.80 లక్షలు వరకు వసూలు చేశాడు. వీటితో రెండు విలువైన కార్లు, బుల్లెట్ బైక్, జగిత్యాలలో ఓ ఇళ్లు, ఓ ఓపెన్ స్లాబ్ కొనుగోలు చేశాడు. వెలుగు చూసిందిలా.. లక్ష్మీనారాయణ వ్యవహారంపై అనుమానం కలిగిన రమేష్ మంచిర్యాల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఈనెల 12న లక్ష్మినారాయణ ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై ఆకస్మికంగా దాడి చేశారు. అక్కడ ఐఏఎస్ బోర్డు, నల్ల కోటు కనిపించడంతో స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు బాధితులు కూడా పెద్ద సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు లక్ష్మినారాయణను శనివారం అరెస్ట్ చేసి.. అతడి నుంచి రెండు కార్లు, బుల్లెట్ బైక్, బాధితుల సర్టిఫికెట్స్, ఏడు రిజిస్టర్లు, రూ.2.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అభినందించిన సీపీ, డీసీపీ, ఏసీపీ నకిలీ ఐఏఎస్‌ను పటుకున్న సీఐ ముత్తి లింగయ్య, ఎస్సై దేవయ్య, కిరణ్‌కుమార్‌ను సీపీ సత్యనారాయణ డీసీపీ, ఏసీపీ అభినందించారు. -
రంజీ క్రికెటర్‌ను మోసగించిన కోడెల కుమారుడు
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక క్రీడాకారుడి వద్ద శివరామ్ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేసిన వైనం తాజాగా వెలుగుచూసింది. బాధితుడైన ఆంధ్రా రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజు శుక్రవారం గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన అప్పలస్వామి కుమారుడు నాగరాజు ఆంధ్రా రంజీ జట్టు తరఫున గత ఐదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. రెండేళ్ల కిందట విజయవాడకు చెందిన భరత్‌చంద్ర ద్వారా నాగరాజుకు కోడెల శివరామ్ పరిచయమయ్యాడు. ఆ సమయంలో తనకు రైల్వే ఉద్యోగంపై మక్కువ ఉందని కోడెల శివరామ్‌కు చెప్పాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న శివరామ్ స్పోర్ట్స్ కోటాలో రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో గతేడాది ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికెళ్లి రూ.15 లక్షలను నాగరాజు ఇచ్చాడు. అప్పుడు డబ్బు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్ వెళ్లాలని శివరామ్ చెప్పాడు. అతడు చెప్పినట్టే నాగరాజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని మరుసటి రోజు కాన్పూర్ వెళ్లాడు. అక్కడ కోడెల శివరామ్‌కు చెందిన ఓ వ్యక్తి నాగరాజును కలిసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ చేసేటప్పుడు కబురు చేస్తామని నమ్మబలికాడు. దీంతో నాగరాజు తిరిగొచ్చేశాడు. మే 23 తర్వాత అసలు విషయం తెలుసుకుని.. మే 23న ఎన్నికల ఫలితాల అనంతరం కోడెల కుటుంబం అక్రమంగా వసూళ్లు చేసిన కేట్యాక్స్, ఉద్యోగాలిస్తామని మోసగించిన సంఘటనలపై వరుసగా నమోదవుతున్న కేసుల విషయం తెలుసుకుని తాను కూడా మోసపోయానని నాగరాజు నిర్ధారించుకున్నాడు. కోడెల శివప్రసాదరావుకు ఫోన్లో జరిగిన విషయాన్ని వివరించగా డబ్బులు తిరిగి ఇప్పిస్తానని ఆయన చెప్పడంతో ఈ నెల 2న నాగరాజు నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లాడు. అయితే.. నాగరాజును బెదిరించి కోడెల అనుచరులు బాండ్ పేపరును చించేశారు. దీంతో తాను పోలీసులను ఆశ్రయిస్తానని నాగరాజు హెచ్చరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం బయటకు తెలుస్తుందని, శుక్రవారం డబ్బు ఇస్తానని నరసరావుపేట రావాలని కోడెల పిలిపించాడు. అక్కడ నాగరాజు చాలాసేపు వేచి చూశాక గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి దగ్గరకు వెళితే డబ్బులు ఇస్తారని అక్కడకు పంపారు. గుంటూరుకు వచ్చి కోడెలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో రూరల్ ఎస్పీకి నాగరాజు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరాడు. చదవండి: కోడెలపై లారీ ఓనర్ల ఫైర్..! ‘కోడెల ట్యాక్స్ పుట్ట బద్దలవుతోంది’ ‘కే’ ట్యాక్స్ బాధితుల క్యూ అజ్ఞాతంలో కోడెల కుమారుడు, కుమార్తె ‘కే ట్యాక్స్’పై ఐదు కేసులు కోడెల తనయుడు శివరామ్‌పై కేసు నమోదు కోడెల పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోలేకపోయాడు -
అరుణకు రైల్వే ఉద్యోగం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణరెడ్డికి నజరానాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు రూ. 2 కోట్ల నగదు ప్రోత్సాహకం ప్రకటించగా... తాజాగా దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) గ్రూప్ ‘సి’ ఉద్యోగాన్ని కేటాయించింది. అంతర్జాతీయ వేదికపై అదరగొట్టిన అరుణకు ఎస్సీఆర్లో ఉద్యోగం కేటాయించడం సంతోషంగా ఉందని జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. -
హర్మన్‌ప్రీత్‌కు ఓఎస్డీగా పదోన్నతి
ముంబై: భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు రైల్వే సంస్థలో పదోన్నతి లభించింది. ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పంజాబ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో అసాధారణ బ్యాటింగ్‌తో హర్మన్ (115 బంతుల్లో 171 నాటౌట్) భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన సంగతి తెలిసిందే. ఆమె ఆటతీరుకు ప్రోత్సాహకంగా రైల్వే శాఖ వెస్టర్న్ రైల్వే పరిధిలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పదోన్నతి కల్పించింది. ముంబైలో ఆమె 2014 నుంచి చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తోంది. -
96 శాతం మార్కులొచ్చినా ఉద్యోగం ఇవ్వలేదు
మోదీ జోక్యం కోరుతున్న ఓ అభ్యర్థి న్యూఢిల్లీ: రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలో 96 శాతం మార్కులు సాధించినప్పటికీ ఉద్యోగం రాకపోడంతో హతాశుడైన ఓ యువకుడు తనకు న్యాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని కోరాడు. ఢిల్లీకి చెందిన లలిత్ కుమార్ 2013 డిసెంబర్లో నార్తర్న్ గ్రూప్-డి పరీక్ష రాశాడు. బాగా రాసినప్పటికీ ఉద్యోగానికి ఎంపిక కాకపోవడంతో అనుమానం వచ్చిన అతడు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించాడు. ఏడాది తర్వాత సమాధానం వచ్చింది. అక్రమ పద్ధతులతో మార్కులు సాధించినందున అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లు అందులో పేర్కొన్నారు. దీంతో అతను కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)ను ఆశ్రయించాడు. లలిత్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణాలను 30 రోజుల్లోగా తెలపాలంటూ నార్తర్న్ రైల్వేకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారిని సీఐసీ గత ఆగస్టు 10న ఆదేశించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాసినట్లు తెలిపాడు. -
రైల్వే ఉద్యోగం పేరిట మోసం
నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ. 2 లక్షలు వసూలుచేసిన అన్నా, చెల్లెలుపై శనివారం నాల్గోనగర పోలీ సులు చీటింగ్ కేసు నమోదు చేశా రు. పోలీసుల కథనం మేరకు. నగరంలోని వెంకటేశ్వరపురం గాంధీగిరిజన కాలనీకి చెందిన నల్లగండ్ల రవికుమార్, సునీత అన్నాచెల్లెలు. రవికుమార్ పెరంబూర్‌లోని రైల్వేకేంద్రంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, సునీత నెల్లూరు రైల్వేస్టేషన్లో గ్యాంగ్ఉమన్గా పనిచేస్తున్నారు. కొంతకాలం కిందట రవి కుమార్ బ్లూస్టిక్ కడ్డీలు, సాం బ్రాణి తయారీ పేరిట పత్రికా ప్రకటన ఇచ్చాడు. అది చూసిన కొడవలూరు మండలం మానేగుంటపాడుకు చెందిన దర్శిగుంట మల్లికార్జున ఫోన్లో సంప్రదించాడు. రవి కుమార్ వద్ద మిషన్ కొనుగోలు చేసి కొంతకాలం ఇంటి వద్దే బ్లూస్టిక్కడ్డీలు, సాంబ్రాణి తయారుచేసి ఆయనకు అమ్మాడు. ఈ క్రమంలో ఇద్దరూ స్నేహితులయ్యారు. తా ను, తన చెల్లెలు సునీత రైల్వే ఉ ద్యోగులమని, రూ. 7లక్షలు పెట్టుకుంటే రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామ ని మల్లికార్జునను రవికుమార్ నమ్మించాడు. బేరసారాల అనంతరం రూ. 2 లక్షలు మల్లికార్జున వారికి మూడు దఫాలుగా చెల్లించాడు. వారు ఓ ఫోర్జరీ నియామక పత్రాన్ని మల్లికార్జునకు ఇచ్చారు. అది గమనించి వారిని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మోసపోయానని గ్రహించిన మల్లికార్జున తన డబ్బు వెంటనే తిరిగి చెల్లించాలని కోరాడు. రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తుండటంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవికుమార్, అతడి సోదరి సునీతపై ఎస్ఐ వెంకటేశ్వర్లు చీటింగ్ కేసు నమోదు చేశారు. -
రైల్వే ఉద్యోగం పేరుతో టోకరా
నిరుద్యోగుల గగ్గోలు ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు రెండు కోట్లతో పరారీ పోలీస్‌స్టేషన్‌లో బంధువులు పెడన : రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు టోకరా వేసిన ఘటన పెడన మండలంలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఉయ్యూరు మండలం ఆనందపురానికి చెందిన బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు పెడన పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పెడన మండలం అచ్చయ్యవారి పాలెం గ్రామానికి చెందిన జన్ను శివరామకృష్ణ ఇటీవల రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిపై చేరాడు. కానీ గ్రామంలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం వచ్చిందని చెబుతూ వచ్చాడు. తనకున్న పరిచయాలతో టికెట్ కలెక్టర్ పోస్టు ఇప్పిస్తానని చెబుతూ 20 నుంచి 30 మంది నిరుద్యోగుల వద్ద నుంచి దాదాపు రూ. రెండు కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెడన మండలం జింజేరు గ్రామంలో ఒకరిద్దరితో పాటు ఆర్తమూరు, పురిటిపాడు, పోతేపల్లి, బంటుమిల్లి, పెనుమలూరు, ఉయ్యూరు, పశ్చిమ గొదావరి జిల్లాలో కొంతమంది, హైదారాబాద్‌కు చెందిన మరికొంతమంది నిరుద్యోగులను నమ్మించి .. ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. అయితే నెలలు గడుస్తున్నా... రైల్వేలో టీసీ ఉద్యోగం రాకపోవడంతో లబోదిబోమంటూ శివ రామకృష్ణ కోసం ఆరాతీయగా ఆయన పరారీలో ఉన్నారని తేలడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బాధితులు జన్ను శివరామకృష్ణ స్వగ్రామానికి చేరుకుని ఇంటి వద్దకు వచ్చి ఉద్యోగం కోసం కట్టిన నగదును తిరిగి ఇవ్వాలని కుటుంబసభ్యలను కోరారు. అయితే వారు వాయిదాల మీద వాయిదాలు వేస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాసినంపాడు గ్రామానికి చెందిన బాధితుడు కె. వెంకటేశ్వరారవుకు జూన్ నెలాఖరుకు నగదు ఇస్తామని వాయిదా వేశారు. లేని పక్షంలో పొలం రాసిస్తామని గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పుకున్నారు. ఇచ్చిన గడువు పూర్తయినా నగదు ఇవ్వకపోవడంతో బాధితుడు ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు ప్రయత్నించాడు. దీంతో జన్ను శివ రామకృష్ణ కుటుంబీకులు బాధితుడిని కొట్టేందుకు వెళ్లగా ఆయన గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టాడు. వారం రోజుఅ అనంతరం అతనికివ్వాల్సిన నగదు అందజేశారు. ఇదిలా వుంటే ఉయ్యూరు మండలం ఆనందపురానికి చెందిన నలుగురు బాధితులు శనివారం జింజేరు గ్రామానికి వెళ్లి నగదు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో జన్ను శివ రామకృష్ణ బంధువులు బాధితులను చితకబాది మీ దిక్కున చోట చెప్పుకోమని చెప్పడంతో బాధితులు పెడన పోలీసులను ఆశ్రయించారు. దీనిపై సోమవారం పెడన పోలీసులు జన్ను శివ రామకృష్ణ బంధువులను పిలిచి స్టేషన్లో విచారించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు ఎస్ఐ దుర్గా ప్రసాదు విలేకరులకు తెలిపారు. -
మరణంలోనూ వీడని స్నేహం
ఇద్దరు ఆప్తమిత్రుల హఠాన్మరణం ఒకరి మృతిని తట్టుకోలేక మరొకరు.. హైదరాబాద్, న్యూస్‌లైన్: వారివురు బాల్య స్నేహితులు. పుట్టి పెరిగింది మొదలు వారి పిల్లలకు వివాహాలు చేసి తాతయ్యలు అయ్యేంత వరకు పక్కపక్క నివాసాల్లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా, దీన్ని తట్టుకోలేక మిత్రుడి మృతదేహం వద్దే మరొకరు కుప్పకూలి చనిపోయారు. ఈ సంఘటన సికింద్రాబాద్, అడ్డగుట్ట డివిజన్ తుకారాంగేట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. తుకారాంగేట్ ప్రాంతంలోని గడ్డమీదిబస్తీకి చెందిన కె.నర్సింగరావు (65), భగవాన్(62) చిన్ననాటి మిత్రులు. బస్తీలో పక్కపక్కన్నే ఇరువురి నివాసాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి ప్రాణం. రైల్వేలో ఉద్యోగం చేసిన నర్సింగరావు.. ఇటీవల పదవీ విరమణ చేశారు. భగవాన్ అదే ప్రాంతంలో మిర్చిబండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. వృత్తిరీత్య బిజీగా ఉన్నా నిత్యం వారివురు కలసి మాట్లాడుకోనిదే సంతృప్తి చెందరు. కొంతకాలంగా ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న నర్సింగరావును చూసి భగవాన్ ఆందోళనకు గురవుతుండేవారు.మంగళవారం ఉదయం గుండెపోటుతో నర్సింగరావు మృతిచెందారు. ఈ వార్త తెలుసుకొని అక్కడికి చేరుకున్న భగవాన్ తన బాల్య మిత్రుడు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. స్నేహితుడి మృతదేహంపై పడి రోదిస్తుండగా.. అదే సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తుండగానే తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలుగా మిత్రులుగా బస్తీవాసులకు సుపరిచితులైన వీరు ఒకేమారు తుదిశ్వాస విడవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.