మరణంలోనూ వీడని స్నేహం
ఇద్దరు ఆప్తమిత్రుల హఠాన్మరణం
ఒకరి మృతిని తట్టుకోలేక మరొకరు..
హైదరాబాద్, న్యూస్‌లైన్: వారివురు బాల్య స్నేహితులు. పుట్టి పెరిగింది మొదలు వారి పిల్లలకు వివాహాలు చేసి తాతయ్యలు అయ్యేంత వరకు పక్కపక్క నివాసాల్లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా, దీన్ని తట్టుకోలేక మిత్రుడి మృతదేహం వద్దే మరొకరు కుప్పకూలి చనిపోయారు. ఈ సంఘటన సికింద్రాబాద్, అడ్డగుట్ట డివిజన్ తుకారాంగేట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. తుకారాంగేట్ ప్రాంతంలోని గడ్డమీదిబస్తీకి చెందిన కె.నర్సింగరావు (65), భగవాన్(62) చిన్ననాటి మిత్రులు. బస్తీలో పక్కపక్కన్నే ఇరువురి నివాసాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి ప్రాణం. రైల్వేలో ఉద్యోగం చేసిన నర్సింగరావు.. ఇటీవల పదవీ విరమణ చేశారు.
భగవాన్ అదే ప్రాంతంలో మిర్చిబండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. వృత్తిరీత్య బిజీగా ఉన్నా నిత్యం వారివురు కలసి మాట్లాడుకోనిదే సంతృప్తి చెందరు. కొంతకాలంగా ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న నర్సింగరావును చూసి భగవాన్ ఆందోళనకు గురవుతుండేవారు.మంగళవారం ఉదయం గుండెపోటుతో నర్సింగరావు మృతిచెందారు. ఈ వార్త తెలుసుకొని అక్కడికి చేరుకున్న భగవాన్ తన బాల్య మిత్రుడు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. స్నేహితుడి మృతదేహంపై పడి రోదిస్తుండగా.. అదే సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తుండగానే తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలుగా మిత్రులుగా బస్తీవాసులకు సుపరిచితులైన వీరు ఒకేమారు తుదిశ్వాస విడవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.