ఆ ‘డబ్బు’ను ప్రభుత్వం వద్దే ఉంచండి
సీపీఎస్‌ఈ ఉద్యోగులకు డీవోపీటీ ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో (సీపీఎస్‌ఈ) పనిచేసే ఉద్యోగులందరూ..సీపీఎస్‌ఈల అనుబంధ, సంయుక్త సంస్థలలో విధులు నిర్వహిస్తున్నపుడు వారి సేవలకు సదరు సంస్థల నుంచి పొందే సిట్టింగ్ ఫీజులు, బోనస్‌లు, లాభాలు–షేర్లలో వాటాలు వంటి ధన సంబంధమైన అదనపు ప్రయోజనాలన్నింటినీ ప్రభుత్వం దగ్గరే డిపాజిట్ చేయాలి. ఈ మేరకు సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేస్తూ అన్ని మంత్రిత్వ శాఖలను వారి ఉద్యోగుల్లో దీనిపై అవగాహన కల్పించాలని కోరింది.
చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, పంక్షనల్ డైరెక్టర్లు సహా ఎవరైనా ఇప్పటికే ఇలాంటి అదనపు ప్రయోజనాలు పొంది ఉంటే, వాటిని తమ మాతృసంస్థ దగ్గరే డిపాజిట్ చేయాలని చెప్పింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఏ ఉద్యోగి సేవలనైనా, ఏ విధంగా అయినా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుందనీ, అందుకోసం ఉద్యోగులు అదనపు పారితోషికం అడగకూడదని ప్రభుత్వ సంస్థల విభాగం (డీపీఈ) నిబంధనల్లో పేర్కొంది.