
లాలు తనయుడికి డిప్యూటీ సీఎం పదవి?
పట్నా: ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్కు బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఆర్జేడీ శాసనసభ పక్ష నాయకుడిగా తేజస్వి యాదవ్ను నియమించవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
శుక్రవారం బిహార్ ముఖమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. నితీశ్ కేబినెట్లో లాలు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లకు బెర్తులు దక్కనున్నట్టు సమాచారం. లాలు చిన్న కొడుకు తేజస్వికి డిప్యూటీ సీఎం పదవి దక్కే చాన్స్ ఉంది.
లాలు ఈ విషయంపై నితీష్తో చర్చించినట్టు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. లాలు కొడుకులు తాజా ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా లాలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి పార్టీలు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్లు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 సీట్లు గెల్చుకున్నాయి.