దేశ, విదేశాల్లోని మొత్తం నల్లధనాన్ని వెలికితీస్తే దేశంలోని ప్రజలందరికీ తలా రూ. 15 లక్షల చొప్పున వస్తుందంటూ గత
ఎన్నికల్లో ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ప్రభుత్వం వివరణ
న్యూఢిల్లీ: దేశ, విదేశాల్లోని మొత్తం నల్లధనాన్ని వెలికితీస్తే దేశంలోని ప్రజలందరికీ తలా రూ. 15 లక్షల చొప్పున వస్తుందంటూ గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోదీ చేసిన ప్రకటన కేవలం ఉదాహరణగా చెప్పినదని కేంద్రం పేర్కొంది.. వివిధ అంచనాల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారంది. మంగళవారం రాజ్యసభలో ఓ సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ వివరాలు వెల్లడించారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనంపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
అధికారులు ఇప్పటికే రూ. 3,250 కోట్లకుపైగా నల్లధనాన్ని గుర్తించారని.. దానిపై విచారణ, పన్ను వసూళ్ల ప్రక్రియను ప్రారంభించారని చెప్పారు. ఎన్నికల్లో మోదీ ప్రకటనపై ప్రశ్నించగా... ‘అది విదేశాల్లో భారీగా నల్లధనం ఉందన్న అంచనాల ఆధారంగా చేసిన ప్రకటన. చాలా మంది ఇలాంటి ప్రకటనలు చేశారు’ అని చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో నల్లధనం దాచుకున్న 628 మందిలో చాలావరకు గుర్తించామని, ఈ నెల 31లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు ఖాతాలు తెరవడంపై నిషేధం పెట్టే యోచనేదీ లేదన్నారు.