న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా కుంభమేళాకు పేరుంది. యునెస్కో గుర్తింపు కూడా పొందింది. మత్స్య పురాణంలో సాగర మథనం కథ ప్రకారం అమృత కలశం సొంతం చేసుకోడానికి రాక్షసులు, దేవతల మధ్య 12 ఏళ్లు యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా అమృత కలశం నుంచి చిందిన బిందువులు భారతదేశంలోని నాలుగు ప్రాంతాల్లో పడ్డాయట. అవి ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. ఈ నదీ తీరాల్లో ప్రతి 12 ఏళ్లకు కుంభమేళా నిర్వహిస్తారు. ఆరేళ్లకోసారి అర్ధ కుంభమేళా, 144 ఏళ్లకోసారి మహా కుంభమేళా జరుగుతుంది.
ఈ ఏడాది ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లోని త్రివేణి సంగమం వద్ద అర్ధ కుంభమేళా జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 15 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవం మార్చి 4 (మహా శివరాత్రి) తో ముగుస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 12 కోట్ల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే కుంభమేళ అనగానే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు నాగసాధువులు. ఒళ్లంతా బుడిద పూసుకుని, దిగంబరంగా లేదా అర్థ నగ్నంగా తిరుగుతూ.. మరేదో లోకం నుంచి వచ్చిన వారిలా కనిపించే నాగసాధువులను కుంభమేళా ఉత్సవాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చిన ఆత్మలుగా భావిస్తారు. దేశాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే సైన్యంగా జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ నాగ సాధువులను తయారు చేశారనే ప్రతీతి. అఖరాలలో నివసించే వీరు కుంభమేళా కోసం తరలి వస్తారు. ఈ కుంభమేళా ఉత్సవాల్లో బందీప్ సింగ్ అనే వ్యక్తి నాగసాధులకు సంబంధించిన అరుదైన ఫోటోలతో పాటు ఆసక్తికర సమాచారాన్ని కూడా అందించారు.
దిగంబరత్వం.. బూడిద
నాగ సాధువులు శ్మశాన బూడిదను మాత్రమే ఒంటికి పట్టించుకుంటారు. ఇలా బూడిదను రాసుకోవడం అంటే అన్ని బంధాల నుంచి విముక్తి అయ్యానని తెలపడం. ఐహిక వాంఛల నుంచి విముక్తి అయ్యాము... వైరాగ్య పంథాలో పయనిస్తున్నామని ప్రకటించడం. సాధరణ మానవునికి ఉన్న వాంఛలను తాము జయించామని తెలపడం కోసం ఇలా దిగంబరంగా తిరుగుతారు. వ్యవసాయదారుడైన సురేశ్వర్ గిరి(60) కుటుంబంతో పాటు వృత్తిని వదిలి సన్యాస దీక్ష తీసుకుని నాగ సాధువుగా మారారు. తలకు, ఒంటికి పట్టిన బూడిదను వదిలించు కోవడం కోసం తన జటాలను విదిలిస్తుండగా తీసిన ఫోటో శ్మశాన నివాసి అయిన పరమేశ్వరుని అంశను చూపిస్తున్నట్లుగా గోచరిస్తుంది.
రుద్రాక్ష ధారణ
పరమేశ్వరుని మూడో కన్నుగా రుద్రాక్షను పరిగణిస్తారు. చాలామంది నాగ సాధువులు కేజీల కొద్ది రుద్రాక్షలను ధరిస్తారు. నాగబాబా శక్తి గిరి (54) రుద్రాక్షలనే వస్త్రాలుగా ధరించాడు. సుమారు 70 కిలోల బరువున్న 1,25,000 రుద్రాక్షలను ఒంటిపై ధరించాడు. మరో నాగబాబా రాజ్ పూరి 21 కిలోల బరువున్న శివలింగాన్ని తల మీద ధరించాడు.
చబి సంప్రదాయం
ఐహిక వాంఛల్ని ముఖ్యంగా లైంగిక కోరికల్ని వదిలేసి పూర్తి బ్రహ్మచర్యంతో, దేహంలోని ప్రతి అవయవాన్ని బలోపేతం చేసుకునేందుకు కఠిన శిక్షణలు పొందుతారు నాగ సాధువులు. లైంగిక వాంఛల్ని వదిలేసుకున్నామనే దానికి నిదర్శనంగా ఈ చబి సంప్రదాయాన్ని పాటిస్తారు. దీనిలో భాగంగా మర్మాంగాలతో సాహసోపేతమైన పనులను చేస్తారు. ఈ ఫోటోలో నాగబాబా కమల్ పూరి ప్రదర్శిస్తున్నది చబి ఆచారాన్నే. మర్మాంగాన్ని రాడ్‌కు చుట్టి దాని మీద మరో వ్యక్తిని నిల్చోబెట్టాడు. కొందరు రాడ్ బదులు కత్తిని కూడా ఉపయోగిస్తారు.
ఊర్ధ్వబాహు హఠ యోగ
దీన్ని సాధన చేసేవారు.. ఏళ్ల పాటు ఒక చేతిని గాల్లోకి లేపే ఉంచాలి. కిందకు దించకూడదు. శరీరం మీద మెదడు పూర్తి పట్టు సాధించడం కోసం ఇలాంటి కఠిన సాధనలు చేస్తారు. ఉజ్జయినికి చెందిన నాగబాబా రాధే పూరి గత పన్నేండేళ్లుగా దీన్ని సాధన చేస్తున్నాడు.
మరిజునా..
ఏకాగ్రతతో, తదేక దీక్షగా సాధనను కొనసాగించడం కోసం మరిజునాను పీలుస్తామని వెల్లడించాడు నాగబాబా రాజు పూరి. ఎరుపెక్కిన కళ్లతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనికునిలా.... చిల్లం నుంచి పొగ పీల్చడంతో అతని కళ్లు ఎర్రబడ్డాయి. సంప్రదాయాన్ని కాపాడే యోధులుగానే ప్రజలు తమను గుర్తించాలనుకుంటారు వీరు.
Comments
Please login to add a commentAdd a comment