హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే కుంభమేళా 2025, జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానుంది. కుంభమేళా సమయంలో నాగా సాధువులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇంతకీ నాగా సాధువుల ప్రత్యేకత ఏమిటి? వారి జీవనశైలి ఎలా ఉంటుంది? కుంభమేళాకు ఎందుకు తరలివస్తారు?
నాగా సాధువులు హిందూ ధర్మంలోని సాధువుల తరగతికి చెందినవారు. వీరిని తపోధనులని కూడా అంటారు. వీరు నగ్నంగా జీవనం సాగిస్తారు. వీరు యుద్ధ కళలో ప్రవీణులుగా గుర్తింపు పొందారు. కఠినమైన తపస్సు, పరిత్యాగం, ఆధ్యాత్మిక సాధనలతో వీరు నిత్య జీవనం సాగిస్తుంటారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు వీరు తరలివస్తుంటారు. వీరిని చూసేందుకు, ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులు పరితపిస్తుంటారు.
సమాజానికి దూరంగా ఉంటామని ప్రమాణం
నాగా సాధువులు నిత్యం ధాన్యంలో ఉంటూ, సమాజానికి దూరంగా ఉంటామని భగవంతుని ముందు ప్రమాణం చేస్తారు. అందుకే వారు జనావాసాలకు దూరంగా ఏకాంతంగా జీవిస్తుంటారు. కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వారు బయటకు వస్తుంటారు. ఈ సందర్భంగా నాగా సాధువులు వారిలో వారు కలుసుంటారు. తమ అనుభవాలను, ఆలోచనలను పరిస్పరం పంచుకుంటారు. దీనికి వారు కుంభమేళాను వేదికగా చేసుకుంటారు. కుంభమేళా సందర్భంగా నాగా సాధువులు గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అలాగే వారు భక్తులకు జ్ఞానబోధ చేస్తారు. తమ తపఃశక్తులను ప్రదర్శిస్తుంటారు.
ఆకాశమే తమ దుస్తులుగా భావిస్తూ..
నాగా సాధువులు నగ్నంగా ఉంటారు. ఆకాశామే తమ దుస్తులుగా భావిస్తారు. కత్తి, త్రిశూలం తదితర ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నాగా సాధువులకు బాగా తెలుసు. చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. నిరాహారులుగా ఉంటూ కఠినమైన తపస్సు ఆచరిస్తారు. శివుణ్ణి ఆరాధిస్తుంటారు. వారికి జునా అఖారా, నిరంజని అఖారా మొదలైన అఖారాలతో సంబంధం ఉంటుంది. కుంభమేళా తర్వాత వీరు తిరిగి తమ నివాసస్థానాలైన అడవులు, కొండలకు చేరుకుంటారు.
మహాకుంభమేళాకు పురాతన చరిత్ర
కుంభమేళా సందర్భంగా గంగా, యమున సరస్వతి సంగమ ప్రదేశంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇందుకోసం సుదూర తీరాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు. మహాకుంభమేళా పురాణకాలం నాటిదని చెబుతారు. అమృత కలశం కోసం దేవతలు- రాక్షసుల మధ్య యుద్ధం జరిగినప్పుడు, నాలుగు అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయని, ఆ నాలుగు ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి, మోక్షప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని కూడా అంటారు.
మహాకుంభమేళా జరిగే పుణ్యదినాలు
మొదటి పుణ్య స్నానం- జనవరి 13(పుష్య పూర్ణిమ)
రెండవది- జనవరి 14 (మకర సంక్రాంతి
మూడవది- జనవరి 29(మౌని అమావాస్య)
నాల్గవది- ఫిబ్రవరి 3(వసంత పంచమి)
ఐదవది-ఫిబ్రవరి 12 ( మాఘ పూర్ణిమ)
చివరిది- ఫిబ్రవరి 26(మహాశివరాత్రి)
ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment