ఫిట్‌నెస్ ట్రైనర్ కార్తిక్ సమక్షంలో కసరత్తులు చేస్తున్న దేవెగౌడ (ట్విటర్ ఫొటో)
సాక్షి, బెంగళూరు : కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చిన ఫిట్‌నెస్ చాలెంజ్‌కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విసిరిన సవాల్‌ను స్వీరించిన ప్రధాని మోదీ తన ఫిట్‌నెస్ వీడియోను పోస్ట్ చేయడంతో పాటు కర్ణాటక సీఎం కుమారస్వామితో పాటు మరికొంత మందిని చాలెంజ్ చేశారు. అయితే మోదీ సవాల్‌కు కుమారస్వామి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. తాను ఫిట్‌గానే ఉన్నానని, తన రాష్ట్రం ఫిట్‌నెస్ కోసం ప్రయత్నిస్తున్నానని బదులిచ్చాడు. అయితే ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న కుమారస్వామిని కాకుండా ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను మోదీ సవాలు చేయాల్సిందంటూ జేడీఎస్ మద్దతుదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేవెగౌడ చేస్తున్న కసరత్తులు అలాంటివి మరి.
మోదీ ఫిట్‌నెస్ వీడియోపై మిశ్రమ స్పందనలు వచ్చిన నేపథ్యంలో దేవెగౌడ చేస్తున్న కసరత్తులు చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. 86 ఏళ్ల వయస్సులోనూ కఠినమైన కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్ పట్ల శ్రద్ధ వహిస్తున్న దేవెగౌడ అందరికీ ఆదర్శమంటూ కితాబు ఇస్తున్నారు. బెంగళూరులోని తన నివాసంలో జిమ్‌ను ఏర్పాటు చేసుకున్న దేవెగౌడ ప్రత్యేకంగా ఫిట్‌నెస్ ట్రైనర్‌ని కూడా నియమించుకున్నారు.
ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘తక్కువగా మోతాదులో ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్‌కు దూరంగా ఉండడం, తక్కువగా నిద్రపోవడం, వేకువజామునే నిద్రలేచి వ్యాయామం చేయడం.. అన్నింటికీ మించి దురాశ లేకుండా ఉండడమే తన ఆరోగ్య రహస్యమని దేవెగౌడ చెప్పారు. మరి ప్రధాని మోదీ ఫిట్‌నెస్ వీడియోపై అభిప్రాయమేమిటని అడగ్గా చిరునవ్వు చిందించారు. దేవెగౌడ ఫిట్‌నెస్ ట్రైనర్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘ఉదయాన్నే నిద్రలేవగానే దేవెగౌడ గంటపాటు ట్రెడ్‌మీల్‌పై నడుస్తారు. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్, డంబెల్స్‌తో మరెన్నో కఠినమైన ఎక్సర్‌సైజులు’ చేస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment