దొడ్డబళ్లాపురం: మాజీ ప్రధాని మనవనిగా, మాజీ సీఎం కుమారునిగా, సినీ హీరోగా ఉన్న నిఖిల్ కుమారస్వామి వరుసగా అపజయాలు చవిచూస్తున్నాడు. గత ఎంపీ ఎన్నికల్లో మండ్య నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నియోజకవర్గం నుంచి నిలబడి మరోసారి మట్టి కరిచాడు. దీంతో దేవెగౌడ కుటుంబం మూడోతరం రాజకీయ అరంగేట్రానికి కాలం కలిసిరావడం లేదనే ప్రచారం మొదలైంది.
తనయుని కోసం త్యాగం
తాత, తండ్రి, తల్లిని గెలిపించిన రామనగర ప్రజలు నిఖిల్‌ను అసెంబ్లీకి పంపించలేకపోయారు. తల్లి అనిత కుమారస్వామి తన నియోజకవర్గాన్ని కుమారుని కోసం త్యాగం చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించి అతన్ని గెలిపించాలని కోరినా ఓటర్లు పట్టించుకోలేదు. 10,715ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ గెలవడంతో జేడీఎస్ పెద్దలు నిశ్చేషు్టలయ్యారు. ఇక్కడ సునాయాస విజయం సాధ్యమని వారు అనుకున్నారు.
రామనగరను పట్టించుకోలేదనా?
నిఖిల్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామనగర తాలూకాను ప్రజలు ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయారు. ఇక్కడి నుంచి దేవెగౌడ కుటుంబం నుంచి ఎవరు గెలిచినా, ప్రజల చేతికి అందరని, సమస్యలు చెప్పుకోవాలంటే స్థానిక జేడీఎస్ నేతల కాళ్లు పట్టుకోవాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. స్థానిక జేడీఎస్ నేతలను గుర్తించకపోవడం, అధికారంలో ఉన్న సమయంలో ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం వల్ల ప్రజల్లో నిరసన భావం ఏర్పడింది. కోవిడ్ సమయంలో అనితాకుమారస్వామి నియోజకవర్గంలో పర్యటించింది లేదు. టీపీ, జీపీ, జడ్పీ తదితర ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పోటీచేస్తే కనీసం వారిని పెద్దలెవరూ పట్టించుకుని సాయం చేసింది లేదని, అందుకే ఈ పరాజయం అని స్థానికులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment