తిరుపతి టికెట్‌.. రంగంలోకి కుమారస్వామి | Former TTD Board Member Tirupati Assembly Ticket Next Election | Sakshi
Sakshi News home page

తిరుపతి అసెంబ్లీ టికెట్‌ .. రంగంలోకి కుమార స్వామి

Published Sun, Jul 8 2018 12:58 PM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Former TTD Board Member Tirupati Assembly Ticket Next Election - Sakshi

తిరుపతి తుడా: కర్ణాటక జేడీఎస్‌తో సత్సంబంధాల నేపథ్యం తిరుపతి టీడీపీలో చిచ్చు రేపింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ కర్ణాటక సీఎంను రంగంలోకి దించుతున్నట్లు భోగట్టా.  జేడీఎస్‌ చీఫ్‌ దేవెగౌడ, కన్నడ ముఖ్యమంత్రి కుమార స్వామి తిరుపతి అసెంబ్లీ టికెట్‌ రమణకు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. దీంతో టీడీపీలోని ఆశావహుల్లో గుబులు మొదలైంది. పార్టీ అధిష్టానంపై వీరంతా గుర్రుగా ఉన్నారు.

జేడీఎస్‌ ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తిరుపతి టీడీపీలో ఇప్పటికే నాలుగు గ్రూపులున్నాయి. వీరంతా ఎవరికి వారే టికెట్టు తమకంటే తమకు అని ప్రచారం చేసుకుంటున్నారు. పరస్పరం బురదజల్లుకుంటూ ఫిర్యాదులు చేసుకుంటుండడంతో అధిష్టానం తల పట్టుకుంటోంది. జేడీఎస్‌ తరఫున ఓవీ రమణను టీడీపీలో చేర్చుకుంటే తామంతా మూకుమ్మడిగా పార్టీకి దూరంగా ఉంటామని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు.

ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. రమణపై టీడీపీలోని రెండు వర్గాలు అధినేతకు ఫిర్యాదులు చేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని, తిరుపతికి ఆయన చేసిందేమీ ఏమీ లేదని ఎమ్మెల్యే వర్గంతో పాటు ఇటీవల గల్లా అరుణకుమారి అండతో తిరుపతి అసెంబ్లీ టికెట్టు తనదేనని ప్రచారం చేసుకుంటున్న ఓ నేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పార్టీలో చేరితే తమ సంగతేంటని నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వారు పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 

వ్యతిరేకిస్తున్న ఆశావహులు..
సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుగుణమ్మ మరోసారి టికెట్టును దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. మంత్రి నారాయణ ద్వారా రాజకీయం నడుపుతున్నారు. పార్టీ అధిష్టానంతో తనకున్న సన్నిహిత సంబంధాల రీత్యా తుడా చైర్మన్‌ ఎమ్మెల్యే సీటుకు తన పేరును ప్రకటిస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీకి  సుముఖత వ్యక్తం చేయడంలేదని తెలుస్తోంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అండతో తిరుపతిలో లిక్కర్‌ వ్యాపారం చేస్తున్న ఓ నేత సామాజిక ప్రతిపాదికన తనకే సీటు దక్కుతుందని  ప్రకటించుకున్నారు. మరోవైపు ఓ మాజీ ఎమ్మెల్యే కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా వీరు నాలుగు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలకు దూరంగా, ఫిర్యాదులతో బిజీగా ఉన్నారు.

ఓవీ రమణ విషయంలో చంద్రబాబునాయుడు తీరుతో ఇప్పటికే ఆ పార్టీకి కొన్ని బలమైన సామాజిక వర్గాలు దూరమవ్వడంతో టికెట్టును ఆశించిన ఇద్దరు వెనుకడుగేసినట్లు తెలుస్తోంది. తిరుపతిలో టీడీపీ గెలవడం అంత సులభం కాదని కొందరు ఆశావహులు ఇప్పటికే గుర్తించారు. విపక్షం వైఎస్సార్‌సీపీ వివిధ కార్యక్రమాలతో దూసుకుపోతూ పలు సామాజిక వర్గాలకు మరింత సన్ని హితం కావడం వీరి ఆశలపై నీళ్లు చల్లుతోంది.

దీంతో  మేయర్‌ గానీ,  నామినేటెడ్‌ పదవి ఇస్తే చాలని ఇద్దరు ఆశావహులు పార్టీలోని సీనియర్ల ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుటుంబ సమేతంగా ఈనెల 13, 14 తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటన నేప«థ్యంలో టీడీపీలో చేర్చుతున్నట్టు కుమారస్వామి చేత ప్రకటించుకునేలా రమణ పావులు కదుపుతున్నారు. ఆ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement