జేడీఎస్ బృహత్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో హెచ్.డి.దేవెగౌడ
బెంగళూరు : జేడీఎస్ పార్టీలోని అసమ్మతి నేతలను సమాధాన పరిచేందుకు కుమారస్వామి చాలా సహనంతో వ్యవహరిస్తున్నారని, అయితే అంత సహనం తనకు లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ పేర్కొన్నారు. నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన పార్టీ బృహత్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీలోని కొంతమంది నేతల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టి, తిరిగి వారు పార్టీతో కలిసి సాగేలా కుమారస్వామి అనేక ప్రయత్నాలు చేశారని, ఇప్పుడిక వాటన్నింటిని వదిలేయాలని ఆయన సూచించారు.
ఇక పార్టీని సంఘటితం చేసి తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే సామర్ధ్యం తనకుందని దేవేగౌడ తెలిపారు. త్వరలోనే తానేంటో చూపిస్తానంటూ ఇతర పార్టీలకు సవాల్ చేశారు. ఇక ఒకానొక సందర్భంలో పూర్తిగా ఉద్వేగానికి లోనైన దేవెగౌడ తాను చనిపోయిన తర్వాత కూడా పార్టీ పటిష్టంగానే ఉండాలని, తన మరణానంతరం కూడా వై.వి.ఎస్.దత్త జేడీఎస్ పార్టీలోనే కొనసాగాలని అన్నారు. ఇక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు జేడీఎస్‌నేతలు రేస్‌కోర్సు రోడ్డులోని జేడీఎస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోవడంపై నిప్పులు చెరిగారు. ఇక ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జేడీఎస్ పార్టీ నేతలు జమీర్ అహ్మద్, చలువరాయస్వామిలు గైర్హాజరయ్యారు.
నాకు ఓపిక లేదు
Published Sun, Jan 25 2015 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM
Advertisement