వారణాసి : ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం వారణాసిలో మహా శివరాత్రి పర్వదిన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. కాశీ విశ్వనాధుని దర్శన భాగ్యం కోసం భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే భోళా శంకరునికి పూజలు, అభిషేకాలు చేస్తూ కరుణా కటాక్షాలు ప్రసాదించాలని పరమేశ్వరున్ని వేడుకుంటున్నారు.
హరహర మహదేవ శంభోశంకరా అంటూ భక్తులు చేస్తున్న జయజయ ధ్వానాలతో విశ్వనాథ క్షేత్రం మార్మోగుతోంది. మరోవైపు... గంగా తీరం జనసంద్రమవుతోంది. పర్వదినం సందర్భంగా వేలాదిమంది భక్తులు గంగమ్మ ఒడిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. గంగమ్మకు హారతులిస్తూ దీవెనలు పొందుతున్నారు.
ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం హరిద్వార్... హరనామస్మరణలో మునిగి తేలుతోంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలు ఆధ్యాత్మిక వెలుగులను సంతరించుకున్నాయి. విద్యుత్ దీప కాంతుల్లో ఆలయాలు మెరిసిపోతున్నాయి. మరోవైపు ఆలయాల్లో భక్తుల కోలాహలం మిన్నంటుతోంది. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. లింగాకారున్ని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివారాధన, శివస్తోత్ర పఠనాలతో సర్వం శివమయం అవుతున్నాయి.
అటు.. ప్రముఖ త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగకు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గంగ, యమున, సరస్వతి నదుల సంగమ క్షేత్రమైన ప్రయాగలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నదీమతల్లికి మంగళహారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ తల్లి తమను చల్లగా చూడాలని, ఆ గంగమ్మను శిరస్సుపై ధరించే మహాశివుని కరుణాకటాక్షాలు తమపై ప్రసరించాలని వేడుకున్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమ్‌నాధ్ దేవాలయం మహాశివరాత్రి వేడుకలతో మెరిసిపోతోంది. ప్రభాసతీర్థంగా పేర్కొనే సోమ్‌నాథ్ దేవాలయానికి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. పంచామృతాలతో శివలింగానికి అభిషేకాలు నిర్వహిస్తూ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. స్వామివారి దర్శనభాగ్యం కోసం భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు.