సోలన్: నవంబర్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ ధూమల్(73) పేరును ఆ పార్టీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల సభలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వీరభద్రసింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. గతంలో రెండుసార్లు హిమాచల్ సీఎంగా పనిచేసిన ధూమల్‌తోనే సాధ్యమన్న పార్టీ నిర్ణయం మేరకు అమిత్ షా ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు.
నిజానికి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేరు కూడా తెరపైకి వచ్చింది. పార్టీ అధినాయకత్వంతో నడ్డాకు సన్నిహిత సంబంధాలున్నా.. క్షేత్ర స్థాయిలో ధూమల్‌కు ఉన్న పట్టు, పార్టీ కార్యకర్తలు ఆయనవైపే మొగ్గుచూపడంతో ధూమల్ పేరును ప్రకటించక తప్పలేదు. ఎన్నికల సభలో షా ప్రసంగిస్తూ.. ‘ఈ ఎన్నికల్లో ఎవరి నాయకత్వంలో బీజేపీ పోటీ చేస్తుందని వీరభద్ర సింగ్ పదే పదే అడుగుతున్నారు.
దేశమంతా మోదీ నాయకత్వంలోనే బీజేపీ పోటీ చేస్తుంది. హిమాచల్‌లో ఎవరి నాయకత్వంలో బీజేపీ పోటీచేస్తుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నవారికి ఆ విషయాన్ని స్పష్టం చేస్తాను. ధూమల్ నాయకత్వంలో హిమాచల్‌లో బీజేపీ పోటీ చేస్తోంది. ఆయన పేరు మీదుగా ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నాం. ప్రస్తుతం ఆయన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత.. డిసెంబర్ 18 అనంతరం ధూమల్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు’ అని చెప్పారు.
ధూమల్ పేరు ప్రకటించగానే సభకు హాజరైన కార్యకర్తలు, పార్టీ నేతలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. 1998 అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ సారథిగా ధూమల్ ప్రచార బాధ్యతల్ని పూర్తిగా తనపై వేసుకున్నారు. 1998, 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి సీఎంగా పనిచేశారు. అయితే 2003, 2012 ఎన్నికల్లో మాత్రం ధూమల్ నేతృత్వంలో బీజేపీ ఓటమి పాలైంది. పెళ్లికొడుకు లేని పెళ్లి పార్టీ అంటూ ఇటీవల కాంగ్రెస్ సీఎం అభ్యర్థి వీరభద్ర సింగ్ బీజేపీ ప్రచారాన్ని ఎద్దేవా చేయడం తెలిసిందే.
మంచి పాలనానుభవం ఉన్న నేత ధూమల్: మోదీ
ప్రధాని మోదీ ట్వీటర్‌లో స్పందిస్తూ.. ‘ధూమల్ పార్టీలో సీనియర్ నేతే కాకుండా హిమాచల్‌లో మంచి పాలనా అనుభవం ఉన్న నాయకుడు. ఆయన మరోసారి అద్భుతం చేస్తారు’ అని పేర్కొన్నారు.
రేపు కర్ణాటకలో బీజేపీ యాత్ర
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్ణాటకలో బీజేపీ ప్రచారాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా యాత్రతో ప్రారంభించనున్నారు. నవంబర్ 2న బెంగళూరులో షా ప్రారంభించే ఈ యాత్ర 84 రోజుల పాటు కొనసాగుతుందని, బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప దాన్ని ముందుండి నడిపిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
జనవరి 28న ముగింపు రోజున బెంగళూరులోనే జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ఉన్న 224 అసెంబ్లీ స్థానాల గుండా సుమారు 7,500 కి.మీ మేర ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగడతామని బీజేపీ జాతీయ కార్యదర్శి పి. మురళీధర్ రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment