ముంబై : తర్వలో మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతి కూటమి భాగస్వామ్యాల మధ్య సీట్ల పంపకంపై చర్చలు షురూ అయ్యాయి. చర్చల్లో భాగంగా బుధవారం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తన వర్గానికి (నేషనలిస్ట్ కాంగ్రెస్ట్ పార్టీ అజిత్ పవార్ వర్గం) 80-90 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు లోక్‌సభ ఎన్నికల తరహాలో చివరి నిమిషం వరకు చేసినట్లు అసెంబ్లీ ఎన్నికల్లో చేయొద్దని వీలైనంత త్వరగా సీట్ల పంపిణీ ఖరారు చేయాలని అజిత్ పవార్ తేల్చి చెప్పినట్లు పలు జాతీయమీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
సీట్ల కేటాయింపులో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఎన్సీపీ గెలిచిన 54 స్థానాల్లో పోటీ చేయడంపై అజిత్ పవార్ పట్టుదలతో ఉన్నారు. పశ్చిమ మహారాష్ట్ర,మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర (ఖండేష్) ప్రాంతం నుంచి కాంగ్రెస్‌పై 20 స్థానాల్లో పోటీ చేయాలని, మైనారిటీ వర్గాల ప్రాబల్యం ఉన్న ముంబైలోని 4–5 స్థానాల్లో కాంగ్రెస్‌పై పోటీ చేసేందుకు అజిత్ పవార్ ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం 100 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని చూస్తుండగా, బీజేపీ 160 నుంచి 170 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. మహరాష్ట్రాలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు మహాయుతి కూటమిలోని మూడు ప్రధాన భాగస్వామ్యాలు ఒకదానికొకటి సీట్లను ఎలా సర్దుబాటు చేసుకుంటాయో చూడాలి మరి.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ 28 స్థానాలకు గాను 2019లో గెలిచిన 23 స్థానాల్లో కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలవగా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం రాయగఢ్‌లో ఒక్క సీటును, శరద్ పవార్ వర్గం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది.
మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఓటమికి బీజేపీతో పొత్తే కారణమని ఆర్‌ఎస్‌ఎస్ అనుసంధాన వారపత్రిక ‘వివేక్’ ఆరోపించింది. దీంతో పాటు అజిత్ పవార్‌ను టార్గెట్ చేస్తూ పూణేకు చెందిన 28 మంది ఎన్సీపీ నాయకులు, పింప్రి-చించ్‌వాడ్ యూనిట్ నగర అధ్యక్షుడితో సహా ,ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)లో చేరడానికి పార్టీని వీడారని తెలిపింది. ఇలా అజిత్ పవార్ గురించి కథనాలు వెలుగులోకి వచ్చిన రోజుల వ్యవధిలో అజిత్ పవార్.. అమిత్ షాతో భేటీ అవ్వడం చర్చాంశనీయంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment