పేటీఎంకే టోకరా!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు ఆన్‌లైన్ చెల్లింపులకు తప్పక ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే ఈ ఆన్‌లైన్ చెల్లింపుల్లో చోటు చేసుకుంటున్న మోసాలు ప్రజలనే కాదు డిజిటల్ వాలెట్ సంస్థలనూ బెంబేలెత్తిస్తున్నాయి.
ప్రముఖ డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం ను కొంతమంది ఆన్‌లైన్ మోసగాళ్లు చీట్ చేశారు. ఈ మేరకు 48 మంది కస్టమర్లు తమను రూ 6.15 లక్షల మేర మోసం చేశారని పేటీఎం వెల్లడించింది. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇప్పటివరకు ఆన్‌లైన్ చెల్లింపుల సందర్భంగా కస్టమర్లు మోసపోయారనే విషయాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే.. పేటీఎం సంస్థను మోసం చేశారనే కొత్త విషయం ఆన్‌లైన్ మోసాలు ఎంతదాకా చేరాయో తెలుపుతోంది.