భారత్‌ను భయపెడుతున్న హెపటైటిస్
న్యూఢిల్లీ: రక్షిత మంచినీరు దొరక్క ఏటా వేలాది మంది భారతీయులు ప్రాణాంతకమైన హెపటైటిస్ జబ్బున పడుతున్నారు. తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ సారి దేశంలో ఎక్కువ హెపటైటిస్ కేసులు నమోదవుతాయని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది దేశంలోని ఏడున్నర కోట్ల మంది భారతీయులు అధిక ధరలకు తాగునీటిని కొనుగోలు చేయడం లేదా రసాయనాలు, డ్రైనేజ్ వాటర్ కలసిన నీటిని తాగుతున్నారని ‘ఇంటర్నేషనల్ చారిటీ వాటర్ ఎయిడ్’ తెలియజేసింది.
రసాయనాలు లేదా మురుగునీరు కలసిన నీటిని తాగడం వల్ల హెపటైటిస్ ఏ, ఈ, జబ్బులు వస్తాయని, వీటి వల్ల మనుషుల్లో కాలేయం పాడువుతుందని, గర్భవతులు మృత్యువాత కూడా పడతారని కేంద్ర వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జబ్బు నీరు, ఆహారం ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. సకాలంలో వైద్య చికిత్స అందిస్తే రోగులు కోలుకుంటారని వారు చెబుతున్నారు.
‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్’ లెక్కల ప్రకారం దేశంలో గతేడాది 1,33,625 హెపటైటిస్ కేసులు నమోదయ్యాయి. వారిలో 397 మంది మరణించారు. బీహార్‌లో 25, 808 కేసులు, మధ్యప్రదేశ్‌లో 12,938, ఉత్తరప్రదేశ్‌లో 11,088, దేశరాజధాని ఢిల్లీలో 8,362, పశ్చిమ బెంగాల్లో 3,865 కేసులు నమోదయ్యాయి. బెంగాల్లో 81 మంది, ఢిల్లీలో 76 మంది, యూపీలో 62 మంది మరణించారు. దేశ జనాభాలో రెండు నుంచి ఐదు శాతం మంది హెపటైటిస్ వ్యాధితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తాగేందుకు రక్షిత మంచినీరు అందించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ఒక్కటే పరిష్కారమార్గమని ఆ సంస్థ సూచించింది.