
'డిజిటల్'తో డిస్కౌంట్
- ఆన్‌లైన్, డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులపై రాయితీలు
- 30 రోజుల్లో గణనీయంగా పెరిగిన కార్డు వినియోగం
- నోట్ల రద్దుకు నెలరోజులైన సందర్భంగా ప్రకటించిన జైట్లీ
న్యూఢిల్లీ:
నగదు వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని వరాలను ప్రకటించింది. పెట్రోలు, ఇన్సూరెన్సు కొనుగోలు మొదలుకుని.. రైల్వే టికెట్ల వరకు పలు సేవల్లో డిజిటల్ చెల్లిం పులకు రాయితీలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం ప్రకటించారు. అవినీతి, నల్లధనాన్ని కట్టడిచేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దును ప్రవేశపెట్టి నెలరోజులైన సందర్భంగా.. జైట్లీ ఈ రాయితీలు ప్రకటించారు. నోట్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో డిజిటల్ విధానం ద్వారా చెల్లింపులను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ దిశగానే జైట్లీ ప్రకటన వెలువడింది.
‘నవంబర్ 8కి ముందు డిజిటల్ లావాదేవీలు చాలా తక్కువ. నగదు వినియోగమే ఎక్కువగా ఉండేది. ఇదే ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను నడిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. డిజిటైజేషన్ దిశగా రూపాంతరం చెందేందుకు ఇదో అవకాశం’ అని జైట్లీ తెలిపారు. ప్రస్తుతం 70 శాతం లావాదేవీలు రూ. 2 వేలకు మించటం లేదని.. అందుకే కార్డు లావాదేవీలు రూ.2 వేల లోపల ఉంటే సర్వీస్ టాక్సు రద్దుచేస్తున్నట్లు జైట్లీ స్పష్టం చేశారు. తమకు అందుతున్న సమాచారం ప్రకారం డిజిటైజేషన్ విధానం చాలా వేగంగా వెళ్తున్నట్లు తెలిసిం దన్నారు. దీని ద్వారా భారత్ త్వరలోనే నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారనుందన్నారు. ఈ రాయితీలు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సం స్థలకే అమలవుతాయన్న జైట్లీ.. ప్రైవేటు సంస్థలు, వాళ్ల ధరకు వారే నిర్ణయించుకోవచ్చన్నారు.
జైట్లీ పది రాయితీలు ఇవే..
1. క్రెడిట్/డెబిట్ కార్డులు, ఈ–వాలెట్, మొబైల్ వాలెట్ ద్వారా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల బంకుల (ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం)లో పెట్రోల్, డీజిల్‌లపై 0.75 శాతం రాయితీ ప్రకటించారు. రోజుకు దేశవ్యాప్తంగా రూ.1,800 కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్ వినియోగం (4.5 కోట్ల మంది వినియోగదారులు) జరుగుతుండగా.. ఇందులో 20 శాతం మాత్రమే ఆన్‌లైన్లో జరుగుతున్నాయి. ఈ నెల రోజుల్లో ఇది 40 శాతానికి పెరిగింది.
2. రూ. 2 వేల వరకు క్రెడిట్/డెబిట్ కార్డు లావా దేవీలపై సర్వీస్ ట్యాక్స్ రద్దుచేశారు.
3. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్‌ఎఫ్‌ఐడీ), హైవే టోల్ ఫాస్ట్‌ట్యాగ్‌లపై 10% రాయితీ.
4. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను విస్తరించేందుకు లక్ష గ్రామాల్లో (పదివేల వరకు జనాభా) అర్హత ఉన్న బ్యాంకులకు రెండు పీవోఎస్ మెషీన్లను సమకూర్చుకునేందుకు నాబార్డు ద్వారా ఆర్థిక సాయం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న 75 కోట్ల మంది నగదురహిత లావాదేవీలు జరిపేందుకు వీలుంటుంది.
5. నాబార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు.. 4.32 కోట్ల మంది కిసాన్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు రూపే కిసాన్ కార్డులు ఇవ్వనుంది. దీని ద్వారా పీవోఎస్ మెషీన్లు, ఏటీఎంలు, మైక్రో ఏటీఎంల దగ్గర వీటిని వినియోగించుకోవచ్చు.
6. సబర్బన్ రైల్వే నెట్‌వర్క్ ఉన్న చోట నెలవారీ, సీజనల్ టికెట్లను ఆన్‌లైన్లో తీసుకునే వారికి 2017, జనవరి 1 నుంచి 0.5 శాతం రాయితీ ఇవ్వనున్నారు. దీని ద్వారా దాదాపు 80 లక్షల మంది ప్రయాణికులకు మేలు జరగనుంది. ఈ రాయితీ మొత్తంగా ఏడాదికి దాదాపు రూ. 2వేల కోట్లు.
7. ఆన్‌లైన్లో రైల్వే టికెట్లు కొనే అందరు ప్రయాణికులకు రూ. 10 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా కల్పించనున్నారు. రోజుకు 14 లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తుండగా.. ఇందులో 58 శాతం వ ుంది ఆన్‌లైన్లోనే టికెట్ తీసుకుంటున్నారు. రైల్వేల్లో కేటరింగ్, వసతి, విశ్రాంతి గదులు మొదలైన సేవలకోసం ఆన్‌లైన్లో చెల్లింపులు జరిపే ప్రయాణికులకు 5శాతం రాయితీ ఇచ్చారు.
8. ప్రభుత్వ రంగ సంస్థల బీమా కంపెనీల్లో జనరల్, జీవిత బీమా కొత్త పాలసీ తీసుకుంటే 10 శాతం, ప్రీమియం చెల్లిస్తే 8 శాతం రాయితీ కల్పించారు.
9. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చేయాల్సిన లావాదేవీల రుసుము, ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) లను ఇకపై వినియోగదారుడిపై కాకుండా సదరు సంస్థే భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని కేంద్రం సూచించింది.
10. ప్రభుత్వ రంగ బ్యాంకుల పీవోఎస్, మైక్రో ఏటీఎంలు, మొబైల్ పీవోఎస్‌లను వాడుతున్న దుకాణాల యజమానులు ఇకపై నెలకు రూ.100కు మించి బ్యాంకులకు చెల్లించాల్సిన అవసరం లేదు. దీం తో ఈ బ్యాంకుల ద్వారా మార్కెట్లో ఉన్న 6.5 లక్షల మెషీన్‌లు వాడుతున్న వ్యాపారులు.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే వాతావరణం ఏర్పడుతుంది.