పంపకాలపై కేంద్రం చొరవ!
- ప్రధాని, హోం, న్యాయ శాఖల మంత్రులతో గవర్నర్ కీలక భేటీ
- తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలపై చర్చలు
- ఉమ్మడి సంస్థల విభజన వివాదాలకు కేంద్రం ముగింపు?
సాక్షి, న్యూఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన పంపకాలకు సంబంధించి ముగింపు పలికేందుకు కేంద్రం చొరవ చూపుతున్నట్లు కేంద్ర హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం ఇక్కడ పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో కలిశారు. ఉభయ రాష్ట్రాల మధ్య రెండేళ్లుగా చిచ్చురేపుతున్న హైకోర్టు విభజనతో పాటు ఏపీ డిమాండ్ చేస్తూ వస్తున్న 9, 10 షెడ్యూలు సంస్థల విభజనపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఇవే అంశాలపై కేంద్రం ఆదేశాల మేరకు గవర్నర్ ఇటీవల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఆ సమావేశ వివరాలను ప్రధానికి, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు సోమవారం గవర్నర్ ఇక్కడ వివరించినట్లు సమాచారం. ముఖ్యంగా 9, 10 షెడ్యూల్‌లోని సంస్థలు, ఆస్తులను జనాభా ప్రాతిపదికన విభజిస్తే అమరావతిలో తాత్కాలిక మౌలిక వసతుల ద్వారా హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు సుముఖం వ్యక్తం చేశారని వివరించినట్లు తెలుస్తోంది. అయితే షెడ్యూలు 9, 10 సంస్థలకు సంబంధించి ఇదివరకే ఉన్న కమిటీ నివేదికల ప్రకారమే జరగడం సమంజసమని తెలంగాణ సీఎం కేసీఆర్ వాదిస్తున్నారని నివేదించినట్లు సమాచారం. న్యాయాధికారుల కేటాయిం పుల అంశంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకునేంతవరకు సద్దుమణగని సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విద్వేషాలు వద్దని, కేంద్రం సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల మేరకు వీటి పరిష్కారానికి సన్నద్దమైందని హోం శాఖ వర్గాలు తెలిపాయి.
హైకోర్టు విభజనపై ప్రధానితో చర్చించలేదు: గవర్నర్
హైకోర్టు విభజనపై తానేమీ ప్రధానితో చర్చించలేదని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రధానితో సాధారణ సమావేశమే. ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఆయనతో హైకోర్టు విషయం చర్చించలేదు. 2 రాష్ట్రాల్లో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. జల వివాదాలపై జోక్యం చేసుకోను. సీఎంలతో చర్చించబోను. కృష్ణా పుష్కరాలకు సకాలంలో పనులు పూర్తవుతాయి’ అని తెలిపారు. మల్లన్నసాగర్ రైతులపై లాఠీఛార్జ్ సంఘటనను ప్రస్తావించగా హైదరాబాద్ వెళ్లాక వివరాలు తెలుసుకుంటానన్నారు.