సాక్షి, చెన్నై: ఓ దిగ్గజం నేలకొరిగింది.. తమిళ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది.. ఏడున్నర దశాబ్దాలుగా తమిళ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన కలైజ్ఞర్, మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి (94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణ.. రక్తపోటు తగ్గడంతో పదిరోజుల క్రితం ఆళ్వార్‌పేట్‌లోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సాయంత్రం 6.10 గంటలకు కన్నుమూసినట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. దీంతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. కరుణకు ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం. ఓవైపు ఆయన అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతుంటే.. మరోవైపు అంత్యక్రియల విషయంలో వివాదం రాజుకుంది.
మెరీనా బీచ్‌లో అన్నాదురై సమాధి పక్కనే కరుణ అంత్యక్రియలు జరగాలని, స్మారకచిహ్నం నిర్మించాలని డీఎంకే పట్టుబడుతుండగా.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంది. మెరీనా బీచ్ విషయంలో న్యాయపరమైన చిక్కులొస్తాయని, అందుకే గాంధీ మండపంలో రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తామని పేర్కొంది. దీనిపై డీఎంకే కోర్టును ఆశ్రయించింది. తమిళనాడులో వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. అన్ని అధికారిక కార్యక్రమా లను రద్దు చేశారు. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాల్ని అవనతం చేశారు. బుధవారం అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.
తీవ్రంగా ప్రయత్నించాం.. కానీ!
‘మన ప్రియతమ నేత, కలైజ్ఞర్ ఎం.కరుణానిధి ఈరోజు సాయంత్రం 6.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వెల్లడించడం చాలా బాధగా ఉంది. మా వైద్యులు, నర్సుల బృందం ఆయన్ను బతికించేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన వైద్యానికి సహకరించలేదు. దేశ రాజకీయాల్లో చాలా గొప్ప నేతగా తన స్థానాన్ని సుస్థిర పరుచుకున్న మహానేత మరణానికి మేం దుఃఖిస్తున్నాం. కుటుంబ సభ్యులకు, డీఎంకే కార్యకర్తలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు ఇది విషాదకర సమయం’ అని కావేరీ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ ప్రత్యర్థి తమిళనాడు మాజీ సీఎం జయలలిత చనిపోయిన 20 నెలల తర్వాత కరుణానిధి కన్నుమూశారు. కరుణానిధి అనారోగ్యం కారణంగా 2007 నుంచి వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. ఆటోమేటిక్ వీల్‌చైర్‌లోనే పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేవారు.
గంటన్నరలోనే..
కరుణానిధి మృతికి గంటన్నర ముందు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ‘మహానేత పరిస్థితి అత్యంత విషమంగా ఉంద’ని పేర్కొన్నారు. దీంతో వేల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు కావేరీ ఆసుపత్రి ముందుకు చేరుకుని రోదించారు. తమ నేత తిరిగి రావాలంటూ నినాదాలు చేశారు. అయితే తర్వాత కాసేపటికే కరుణ ఇక లేరనే వార్త తెలియడంతో గుండెలవిసేలా రోదించారు. తమ అభిమాన నేత ఇక లేరన్న ఆవేదనతో డీఎంకే శ్రేణులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కరుణ ఫోటోలు చేతబూని ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. అటు, చెన్నైలోని ప్రముఖ కూడళ్లలోనూ డీఎంకే కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. సాయంత్రం ఆరున్నరగంటలకే దుకాణాలు, వ్యాపార సముదాయాలను మూసేశారు. చెన్నైతోపాటు తమిళనాడు వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా చెన్నై నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తమిళనాడు సరిహద్దుల్లోని జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక సీఎం కుమారస్వామి ఆదేశించారు.
సంయమనం పాటించండి: స్టాలిన్ విజ్ఞప్తి
ఆసుపత్రి వద్ద, చెన్నై రోడ్లపైకి భారీగా కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి చేజారకుండా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ రంగంలోకి దిగారు. ఇలాంటి విషాదకరమైన సమయంలో కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని ఎలాంటి ఘర్షణకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. నిరసనలు, ఆందోళనల ద్వారా కరుణానిధికి చెడ్డపేరు తెచ్చే పనులేవీ చేయవద్దని సూచించారు. డాక్టర్లు రెండేళ్లుగా కరుణానిధికి ఆరోగ్యం విషయంలో తమ శక్తివంచన లేకుండా ప్రయత్నించారన్నారు. కార్యకర్తలు ప్రశాంతంగా ఉండేలా చూడాలని పార్టీ పదాధికారులకు సూచించారు. సంఘ వ్యతిరేక శక్తులు ఇలాంటి సమయాలను తమకు అనుకూలంగా వాడుకునేందుకు సిద్ధపడతాయని అందుకే కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు.
నివాసానికి కరుణ పార్థివదేహం
కరుణానిధి పార్థివదేహం ఆళ్వార్ పేట ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో తొమ్మిది గంటల సమయంలో గోపాలపురం ఇంటికి తరలించే సమయంలో జనం పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో అంబులెన్స్ మెల్లగా కదిలింది. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కరుణ నివాసం చేరుకునేందుకు గంటన్నర సమయం పట్టింది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు భౌతికకాయాన్ని గోపాలపురం ఇంట్లో ఉంచిన అనంతరం సీఐటీ నగర్‌లోని మరో భార్య రాజాత్తి అమ్మాల్ ఇంటికి తరలించనున్నారు. బుధవారం ఉదయం నాలుగు గంటలకు చెన్నై ఓమందూరు ఎస్టేట్‌లోని రాజాజీ హాల్ వద్ద ప్రజలు, వీఐపీల సందర్శనార్థం కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచనున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లుచేశారు.
ప్రముఖుల సంతాపం
కరుణానిధి అస్తమయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు జాతీయస్థాయి రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కరుణను కడసారి చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ బుధవారం ఉదయం చెన్నై వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమత మంగళవారం అర్ధరాత్రే చెన్నై చేరుకున్నారు. మిగిలిన నేతలు బుధవారం ఉదయం రానున్నారు. కాగా, కలైజ్ఞర్ మృతికి సంతాపసూచకంగా ఢిల్లీతోపాటు అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment