మహిళలకూ మినహాయింపు వద్దు
Published Tue, Nov 8 2016 10:56 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించాలంటే సరి-బేసి పద్ధతి నుంచి మహిళలకు, ద్విచక్ర వాహనదారులకు కూడా మినహాయింపు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తెలిపింది. ఎన్‌సీఆర్ పరిధిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని అరికట్టేందుకు మూడోసారి సరి-బేసి పద్ధతిని అవలంబించాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం భావిస్ఓతంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ (ఈపీసీఏ) పలు సూచనలు చేసింది. ఏమాత్రం మినహాయింపులు లేకుండా సరి బేసి పద్ధతిని ఢిల్లీ ప్రభుత్వం అవలంబించాలని తెలిపింది.
ఢిల్లీలో రవాణా వ్యవస్థ కారణంగా వచ్చే కాలుష్యంలో 32 శాతం బైకులు, స్కూటర్ల వల్లే వస్తోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అయితే, కేవలం కార్లకే తప్ప బైకులకు, స్కూటర్లకు సరి-బేసి విధానం అమలుకాదు. దాంతోపాటు కేవలం మహిళలు మాత్రమే వెళ్లే కార్లను, సీఎన్‌జీ వాహనాలను కూడా ఈ నిబంధన నుంచి మినహాయించారు. ఈ అంశంపై మరోసారి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఈపీసీఏలో సభ్య సంస్థ అయిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమితా రాయ్ చౌధురి తెలిపారు.
త్వరలోనే సరి-బేసి పద్ధతికి సంబంధించిన నియమాలన్నింటినీ చూసి, మరోసారి ఈ విధానాన్ని అమలుచేస్తే తప్ప కాలుష్యం అదుపులోకి రాదని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అన్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థపై కూడా ఆంక్షలు ఉండటం వల్లే ద్విచక్ర వాహనాలను అనుమతించామని ఆయన చెప్పారు. ఢిల్లీలో రోజూ 40 లక్షల మంది బైకులపైనే వెళ్తారని.. వాటిపై కూడా ఆంక్షలు విధిస్తే దాదాపు 20 లక్షల మంది బస్సులు లేదా మెట్రోరైళ్లలో వెళ్లాల్సి ఉంటుందని, కానీ ఇప్పటికిప్పుడు అంత సామర్థ్యం వాటికి లేదని తెలిపారు. తగిన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటేనే బైకులపై కూడా ఆంక్షలు విధించగలమని ఆయన అన్నారు.
Advertisement