
నా పదవులు ఎందుకు పీకేశారో తెలీదు
తన మంత్రిపదవులను ముఖ్యమంత్రి ఎందుకు తప్పించారో తెలియదని సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ అన్నారు.
తన మంత్రిత్వ శాఖల్లో కొన్నింటిని ముఖ్యమంత్రి ఎందుకు తీసేశారో తెలియదని సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ అన్నారు. దానికి సంబంధించిన నిర్ణయాలను నేతాజీతో సంప్రదించి ముఖ్యమంత్రి తీసుకుంటారని చెప్పారు. స్వయానా అన్న కొడుకైన అఖిలేష్ యాదవ్‌తో విభేదాల అనంతరం అన్న ములాయం సింగ్ యాదవ్ వద్ద పంచాయతీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి ఎలాంటి నష్టం జరగలేదని.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధించి రావడం ఖాయమని అన్నారు. మళ్లీ రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పారు.
నేతాజీ ఆదేశాలను అంతా పాటించాల్సిందేనని.. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు కాబట్టి తన పని తాను చేస్తానని అన్నారు. ఆయన నిర్ణయాలను ఏ ఒక్కరూ సవాలు చేయడానికి వీల్లేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా అని ప్రశ్నించగా.. నేతాజీ (ములాయం) ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుందన్నారు. పదవుల విషయంలో సీఎంతో కూడా ఎలాంటి విభేదాలు లేవని.. తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అఖిలేష్ అపాయింట్‌మెంట్ దొరుకుతుందని తెలిపారు. ఇంత త్వరగా తనను రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారని కూడా తాను అనుకోలేదని చెప్పారు.
ఈ సంక్షోభం వెనక అమర్‌సింగ్ పాత్ర ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని ఇప్పటికే అమర్ సింగ్ స్పష్టం చేశారు కదా అని శివపాల్ చెప్పారు. పార్టీలో ఎవరూ చిన్న, పెద్ద ఉండరని.. పనులు చేయడం ద్వారానే ఎవరైనా పెద్దవాళ్లు అవుతారని అన్నారు. ఒక పార్టీలో అందరికీ ఒకేలాంటి సిద్ధాంతాలు కూడా ఉండవన్నారు.