శ్రీనగర్‌లో భద్రతా దళాల గస్తీ.. తాజా చిత్రం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో హతమవుతున్న స్థానిక మిలిటెంట్ల గురించి ఆ రాష్ట్ర పోలీసు అధికారి తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కశ్మీర్‌లో స్థానిక మిలిటెంట్లను చంపేసినప్పుడు సంతోషం వ్యక్తం చేయవద్దని, వారు మన పిల్లలేనని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ రిజర్వు పోలీసు (ఐఆర్పీ) రెండో బెటాలియన్ కమాండెంట్ ఎస్‌ఎస్‌స్పీ శైలేంద్రకుమార్ మిశ్రా ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, ఆ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన గురువారం మీడియాతో అన్నారు.
2009 ఏపీఎస్ బ్యాచ్ అదికారి అయిన మిశ్రా గతవారం ముంబైలో జరిగిన బ్రాహ్మణ సమ్మేళనంలో మాట్లాడుతూ కశ్మీరీ మిలిటెంట్లను హతమార్చడం మన ఉమ్మడి వైఫల్యంగా అభివర్ణించారు. 'మిలిటెంట్ల హత్యలపై సంతోషం వ్యక్తం చేయకండి. ఈ హత్యలు మన పరాజయానికి, ఉమ్మడి వైఫల్యానికి ప్రతీకలు. బుర్హాన్ వనీ హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? వసీం మల్లా (వనీ అనుచరుడు. గత ఏడాది ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు) ఒక భారతీయ పౌరుడు. షోపియన్‌లో జన్మించారు. బీఏ సెకండియర్ విద్యార్థి అయిన అతడు ఎందుకు తుపాకి పట్టాడు. భారతీయుడి గుర్తింపు కాదనుకొని.. దేశంలోని ప్రతి వ్యవస్థను ఎందుకు ద్వేషించాడు?' అని ఆయన అన్నారు. దేశంలో ఉగ్రవాదం లేదని, మిలిటెన్సీ మాత్రమే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని చెప్పారు. 'జమ్మూకశ్మీర్‌లోని కొంతమంది యువతకు మన వ్యవస్థ, మన పనితీరు పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. కానీ వారు కూడా మన పిల్లలే. వాళ్లు మన సొంత మనుషులు. వాళ్లు బందిపోట్లుగా, అసాంఘిక శక్తులుగా మారి ఉండొచ్చు. కానీ వారిని చంపడంలో మాకు ఎలాంటి సంతోషం ఉండదు' అని మిశ్రా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment