సోషల్‌ మీడియా: ఫేక్‌న్యూస్‌కు బ్రేక్‌? | Does social media threaten the illusion of news neutrality? | Sakshi
Sakshi News home page

తప్పుడు సమాచారానికి కళ్లెం?

Published Sun, Oct 22 2017 3:22 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Does social media threaten the illusion of news neutrality? - Sakshi

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరుతున్న కథనాలు, వార్తలు రానురాను ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. అయితే ఎవరిష్టం వచ్చినట్లు వారు వాస్తవాలకు సొంత అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు జోడించి, అయినవి కానట్లుగా, కానివి అయినట్లుగా పోస్ట్‌ చేయడం, వాటిని మరికొందరు గుడ్డిగా ఇతరులకు పంపడం ఇటీవల పెచ్చుమీరిపోతోంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారాన్ని ఏ మేరకు విశ్వసించాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఎన్నికలు, ప్రముఖులకు సంబంధించిన విషయాలు, ప్రభుత్వ విధానాల వంటి విషయాలు సాధారణంగానే ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అయితే ఈ అంశాలపై కొన్నిసార్లు వాస్తవాలకు భిన్నంగా కథనాలు, వార్తలు సామాజిక మాధ్యమాల్లో వెలువడుతుంటాయి. ఆన్‌లైన్‌లో లభించే సమాచారం వచ్చే పదేళ్లలో ఎలా ఉండబోతోందన్న దానిపై ప్యూ (పీఈడబ్ల్యూ) పరిశోధనా కేంద్రం, ఈలాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇమేజింగ్‌ ది ఇంటర్నెట్‌ సెంటర్‌లు సంయుక్తంగా వృత్తి నిపుణులు, మేధావులు, తదితరులతో సమాలోచనలు జరిపాయి.

2016లో బ్రెగ్జిట్‌ ఓటింగ్‌ సందర్భంగా, గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలపుడు ఈ డిజిటల్‌ మాధ్యమాల ద్వారా జరిగిన ప్రచారం, వెలువడిన వార్తలు, సామాజికంగా, సాంస్కృతికంగా వెల్లడైన అభిప్రాయాలు అధిక సంఖ్యాకులపై ప్రభావం చూపాయి. ఈ విధంగా ఏర్పడిన కొత్త సమాచార కేంద్రాల ద్వారా వివిధవర్గాల ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా సమాచారాన్ని అందజేసే ప్రయత్నం కూడా జరిగిందని ఈ అనుభవాలు వెల్లడిస్తున్నాయి.

దాదాపు 900 పైగా న్యూస్‌ అవుట్‌లెట్ల ద్వారా 37.6 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులు జరిపిన సంభాషణల్లో ప్రజలు తమ భావాలు, అభిప్రాయాలకు అనువైన కోణంలో, దృక్పథంలో సమాచారాన్ని, వివరాలను కోరుకుంటున్నట్లుగా మరో అధ్యయనంలో తేలింది. వీటి ప్రాతిపదికన వెలువడే అసమగ్ర, అవాస్తవ సమాచారం, కథనాలను నమ్మే పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘బీబీసీ ఫ్యూచర్‌’ ఇటీవల ‘21వ శతాబ్దంలో మనం ఎదుర్కోబోయే పెను సవాళ్లు’ పేరిట 50 మందికి పైగా నిపుణులను ఇంటర్వ్యూ చేసింది. కొత్త కోణంలో సత్యాన్ని, వాస్తవాన్ని వార్తలుగా అందించడం పెనుసవాల్‌గా మారనుందని వైర్డ్‌ మ్యాగజైన్‌ సహ వ్యవస్థాపకుడు కెవిన్‌ కెల్లీ అభిప్రాయపడ్డారు.

‘ఏవైనా విషయాలకు సంబంధించి అధికారవర్గాలు చెప్పే దానిని విశ్వసించడం కన్నా తోటివారు, సహచరులు వెల్లడించే అంశాలను నమ్మే పరిస్థితి ఏర్పడింది’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల సందర్భంగా పరిశోధనా కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో అవాస్తవ కథనాలు తమను గందరగోళానికి గురిచేశాయని 64 శాతం మంది చెప్పారు. కల్పిత రాజకీయ కథనాలను ఇతరులకు షేర్‌ చేసినట్లు, ఇది కొన్ని సందర్భాల్లో ఉద్దేశ పూర్వకంగా, కొన్ని సార్లు తమకు తెలియకుండానే చేసినట్లు 23 శాతం మంది తెలిపారు. సమాచారం దగ్గరగా మారుతుందని 49 శాతం మంది, అధ్వాన్నంగా మారుతుందని 51 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.

సానుకూల స్పందనలు
∙సమాచారాన్ని సాంకేతికంగా వడపోయడం, అవాస్తవాలను పక్కకు తోసేయడం వల్ల వార్తల్లోని నాణ్యతను ప్రజలు తెలుసుకునే వీలుంటుంది. ∙సమాచార విస్తృతి పెరిగే కొద్ది ప్రజలు అందుకనుగుణంగా వాస్తవాలను అర్థం చేసుకోగలుగుతారు. ∙ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆయా సమస్యలను అధిగమించేలా చేస్తుంది.
 
ప్రతికూల అభిప్రాయాలు

u కేవలం సాంకేతికతే ఈ సమస్యను అధిగమించలేదు. సరైన సమాచారం వెలువడేలా ప్రజలు ఏర్పా ట్లు చేసుకోవాలి. ప్రజల్లో సమాచార సాక్షరత పెరిగేలా చర్యలు తీసుకోవాలి.
u సాంకేతికత కొత్త సవాళ్లను ముందుకు తెస్తున్నందున సమాచార నాణ్యత పెరగదు.
u ఈ సమస్య మానవ సంబం«ధితమైనది కాబట్టి సమాచార విస్తృతి పెరగదు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement