సాక్షి, హైదరాబాద్: డొమెస్టిక్ విమాన సర్వీసులు సోమవారం తర్వాత పరిమిత సంఖ్యలో ప్రారంభమయ్యే అవ కాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు విమానాశ్ర యాలకు వచ్చే ప్రయాణికులు పాటించాల్సిన, అధి కారులు చేపట్టాల్సిన చర్యలపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ విభాగమే విమానాశ్రయాల సెక్యూరిటీ బాధ్యతలు పర్యవేక్షి స్తుండటం తెలిసిందే. ‘వందే భారత్’విమానాల రాకపోకల సందర్భంగా పలు విషయాలు గమనిం చిన విమానాశ్రయాల సెక్యూరిటీ విషయంలో పలు మార్పులు చేసినట్లు సీఐఎస్‌ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్ శుక్రవారం తెలిపారు.
తొలుత మే 1 నుంచి దేశీయ విమాన సర్వీసుల్ని ప్రారంభించాలని యోచిం చారు. అయితే సోమవారం తర్వాత ఎప్పుడైనా ఇవి మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్ విమానాశ్రయాలతోపాటు మరి కొన్ని చోట్ల సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే ఇతర విభాగాల అధికారు లకు ఎలాంటి వ్యాప్తి జరగలేదు. దీంతో తనిఖీలు, సోదాలు చేసే విషయంలో పలు మార్పుచేర్పులు చేశారు. ప్రయాణికులను తాకాల్సిన అవసరం లేకుండా, భౌతిక దూరం పాటిస్తూ తనిఖీలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు.
ఇప్పటి వరకు డొమెస్టిక్ ప్యాసింజర్లు బోర్డింగ్ పాస్ తీసుకుంటే 45 నిమిషాలు, లేకుంటే గంట ముందు విమానా శ్రయంలో రిపోర్ట్ చేయాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఈ సమయాన్ని రెండు గంటలకు పెంచారు. ప్రతి ప్రయాణికుడు తన ఫోన్‌లో కచ్చితంగా ‘ఆరోగ్య సేతు’యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో ప్రతి ప్రయాణికుడు సెల్ప్ డిక్లరేషన్ ఇవ్వాలి. వీలున్నంత వరకు ప్రయాణికులు తమ వెంట ప్రింట్ చేసిన లేదా ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాసులు కలిగి ఉండటం ఉత్తమం. ప్రతి ఒక్క ప్యాసింజర్ కచ్చితంగా ఫేస్‌మాస్క్ ధరించాలి.
భౌతిక దూరం తప్పనిసరి
డిపార్చర్ గేటు వద్ద క్యూలో నిర్దేశించిన బాక్సులు/సర్కిల్స్‌లో నిల్చుని ఉండాలి. ఈ దూరాన్ని కనిష్టంగా నాలుగు, గరిష్టంగా 6 అడుగులుగా నిర్దేశించారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా హ్యాండ్ శానిటైజర్ కియోస్క్‌లు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా వాటి వద్ద చేతులను శానిటైజ్ చేసుకోవాలి. గేటు వద్దకు వెళ్లిన తర్వాత థర్మల్ ్రస్రీనింగ్ చేస్తారు. ఎవరికైనా సాధారణం కంటే ఎక్కవ ఉష్ణోగ్రతలు ఉంటే వారిని క్యూ నుంచి వేరు చేసి, తదుపరి పరీక్షల కోసం హెల్త్ డెస్క్‌కు పంపిస్తారు.
పీపీఈ సూట్స్ లేదా ఫేస్‌మాస్క్, షీల్డ్స్‌లో ఉండే సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది సైతం ప్రయాణికుడి సమీపం నుంచి తనిఖీలు చేయరు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమెరాల వద్ద ప్రయాణికులు తమ టికెట్, గుర్తింపు కార్డులను ప్రదర్శించాలి. వీటిని వెబ్‌క్యామ్ లేదా ట్యాబ్‌ల్లో తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణికుడిని పంపుతారు. ప్రయాణికులు తమ వెంట హ్యాండ్ బ్యాగేజ్ తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. లగేజ్‌లో కూడా 20 కేజీల కంటే తక్కువ బరువు ఉండాలి.
తమ వెంట గరిష్టంగా 350 ఎంఎల్ శానిటైజర్ బాటిల్ తీసుకెళ్లేందుకు అవకాశం ఇస్తున్నారు. విమానయాన సంస్థలు సైతం ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం ఉన్న కౌంటర్లను యథాత«థంగా వినియోగించేందుకు అనుమతి లేదు. బోర్డింగ్ పాసులు, టికెట్లు ఇచ్చే కౌంటర్లు ఒకటి విడిచి మరొకటి పని చేయాల్సి ఉంటుంది. వీలున్నంత వరకు టికెట్ స్కానర్లు, బోర్డింగ్ పాస్ ప్రింటర్లు, బ్యాగ్ ట్యాగ్ ప్రింటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు సేవలు అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధానంలో ఎక్కడా విమానయాన సంస్థ సిబ్బందితో పని ఉండదు.
సిబ్బందికి పీపీఈ కిట్లు..
కౌంటర్ల వద్ద ఉద్యోగులు, ప్రయాణికుడికి మధ్య గ్లాస్‌లు ఏర్పాటు చేయనున్నారు. కౌంటర్ నుంచి పిలుపు వచ్చే వరకు ప్రయాణికులు బాక్సులు, సర్కిల్స్‌లోనే నిల్చుని ఉండాలి. సెక్యూరిటీ చెక్ జరిగే ప్రదేశంలోనూ బాక్సులు, సర్కిల్స్ గీస్తున్నారు. వీటిలో నిల్చునే ప్రయాణికులు తమంతట తాముగా తమ ఒంటిపై ఉన్న లోహంతో కూడిన వస్తువుల్ని తీసి ట్రేలో పెట్టాల్సి ఉంటుంది. డీఎఫ్‌ఎండీల ద్వారా ప్రయాణికుడు వచ్చినప్పుడు బీప్ శబ్దం వస్తే వ్యక్తిగతంగా తనిఖీ చేయనున్నారు.
బోర్డింగ్ కార్డులపై ఎలాంటి స్టాంపింగ్స్ ఉండవు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్‌డీ సీసీటీవీల ద్వారా వీటిని మానిటర్ చేయనున్నారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, హ్యాండ్ హెల్డ్ మెటర్ డిటెక్టర్లు తప్పనిసరి చేశారు. ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత ప్రయాణికుల్ని బోర్డింగ్ గేట్స్ వద్ద ప్రత్యేకంగా మార్కింగ్ చేసిన సీట్లలో కూర్చోబెడతారు. ఈ ప్రాంతాల్లో ఆహార పదార్థాలు ఆర్డర్ చేయడం, డెలివరీ అన్నీ కాంటాక్ట్ లెస్‌గానే జరుగుతుంది. ప్రయాణికుడు విమానం ఎక్కేందుకు విమానం బయల్దేరడానికి 15 నిమిషాల ముందే అనుమతించేవారు. ఇప్పుడు గంట ముందే అనుమతించనున్నారు.
ప్రయాణికుల్ని విమానం వరకు తరలించే బస్సుల్ని రోజూ కనీసం రెండు మూడుసార్లు శానిటైజ్ చేయనున్నారు. విమానం లోపల స్వాగతం పలికే ఎయిర్‌హోస్టెస్ పీపీఈ కిట్లు ధరించేలా చూడాలని భావిస్తున్నారు. విమానం లోపల ఆహారం సరఫరా చేయడానికి ముందు శానిటైజర్ ఇవ్వనున్నారు. విమాన ప్రయాణం పూర్తయ్యే వరకు మాస్క్ ధరించే ఉండాలి. విమాన సర్వీసులు ప్రారంభమయ్యే లోపు మరికొన్ని మార్పులకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సీఐఎస్‌ఎఫ్ పాత్ర కీలకం: సీవీ ఆనంద్, ఎయిర్‌పోర్ట్స్ సెక్టార్ ఐజీ సీఐఎస్‌ఎఫ్
కరోనా విస్తరణ నేపథ్యంలో విమానయానంలో సీఐఎస్‌ఎఫ్ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. దీంతో సిబ్బంది, అధికారులు ఇకపై ‘మినిమం టచ్.. మినిమం ఎక్స్‌పోజర్’విధానంలో విధులు నిర్వర్తించనున్నారు. తనిఖీలు సహా ఏ విషయంలో ప్రయాణికుల్ని నేరుగా తాకాల్సిన అవసరం లేకుండా వీలున్నంత వరకు అత్యాధునిక పరిజ్ఞానంతో పని చేయనున్నారు. ప్రయాణికులు సైతం ఈ విషయంలో తమకు సహకరించాల్సిన అవసరముంది. లాక్‌డౌన్ నేపథ్యంలో గడిచిన 2 నెలలుగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక సంసిద్ధతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక తర్ఫీదు పొందారు.
– సీవీ ఆనంద్, ఎయిర్‌పోర్ట్స్ సెక్టార్ ఐజీ సీఐఎస్‌ఎఫ్
Comments
Please login to add a commentAdd a comment