నేటి నుంచి టేకాఫ్‌.. | Domestic flights to resume on may 25 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టేకాఫ్‌..

May 25 2020 5:44 AM | Updated on May 25 2020 5:44 AM

Domestic flights to resume on may 25 - Sakshi

న్యూఢిల్లీ: నేటి నుంచి దేశీయ విమాన యానం పునఃప్రారంభమవుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా విమాన ప్రయాణాలపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 4.20 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి పట్నాకు తొలి విమానం బయల్దేరనుంది.

ఢిల్లీ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు మరో విమానం ఉదయం 4.30 గంటలకు బయల్దేరుతుంది. ఈ రెండు కూడా ఇండిగో విమాన యాన సంస్థ విమానాలే. అయితే, పలు రాష్ట్రాలు విమానాల పునఃప్రారంభాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా విస్తృతి తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితుల్లో విమాన ప్రయాణాలకు అనుమతించడం సరికాదని మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ తొలుత వ్యతిరేకించాయి.

కాగా, సుమారు 1,050 విమాన సర్వీసుల బుకింగ్స్‌ను విమానయాన సంస్థలు ప్రారంభించాయి. అలాగే, ప్రయాణీకులు, విమాన సిబ్బందికి సంబంధించిన క్వారంటైన్‌ నిబంధనలు ఒకే తీరులో కాకుండా, వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉండటం పైనా ఉండటంపైనా సందిగ్ధత నెలకొంది. తాము వెళ్తున్న రాష్ట్రాల్లోని క్వారంటైన్‌ నిబంధనలను ప్రయాణీకులు తెలుసుకోవాలని ఎయిర్‌ఏసియా ప్రకటించింది. క్వారంటైన్‌ సంబంధిత ఖర్చులతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఈ విషయంలో గందరగోళం నెలకొనడంతో పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులతో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు ఆదివారం పలు దఫాలు చర్చలు జరిపారు. విమానాశ్రయాల్లో కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలపైనా చర్చించారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన క్వారంటైన్‌ నిబంధనలను ప్రకటించాలని కోరారు. ఏ రాష్ట్రమైనా విమాన ప్రయాణాలను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకుంటే.. తమ విమానాల షెడ్యూల్స్‌లో మార్పు ఉంటుందని పలు విమాన యాన సంస్థలు వెల్లడించాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నగరాలకు వెళ్లడానికి పైలట్లు, ఇతర సిబ్బంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

డ్యూటీ దిగిన తరువాత 14 రోజుల హోం క్వారంటైన్‌ సిబ్బంది అందరికీ ఉంటుందా? అనే విషయంపైనా స్పష్టత లేదని ఒక పైలట్‌ వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రానికి వస్తున్న విమాన ప్రయాణీకులకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్, పంజాబ్, అస్సాం రాష్ట్రాలు ప్రత్యేక క్వారంటైన్‌ నిబంధనలను ప్రకటించాయి. పలు ఆంక్షలు, మార్గదర్శకాల మధ్య సోమవారం నుంచి పరిమిత సంఖ్యలో దేశీయంగా విమానాలను నడిపేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే.

ముంబై నుంచి 50 విమానాలు
మహారాష్ట్రలో కరోనా ఉధృతి అధికంగా ఉం డడంతో ముంబై ఎయిర్‌పోర్టు నుంచి రోజు కు కేవలం 50 విమానాల రాకపోకలకు అను మతి ఇస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బగ్దో గ్రా ఎయిర్‌పోర్టుల్లో మే 28 నుంచి విమానాల సేవలను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణానికి సిద్ధంగా విమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement