సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నా ఊరట కలిగించే పరిణామాలూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కరోనా రోగుల్లో దాదాపు సగం మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవుతున్నారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య రెట్టింపయ్యే వ్యవధి 17.4 రోజులకు పెరగడం మరో సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వారం కిందట కేసులు రెట్టింపయ్యే వ్యవధి 15.4 రోజులుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక కోవిడ్-19 రోగులు కోలుకునే రేటు 49.47 శాతానికి ఎగబాకిందని పేర్కొంది. ఇప్పటివరకూ 1,47,194 మంది మహమ్మారి నుంచి కోలుకోగా 1,41,842 క్రియాశీలక కేసులున్నాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 6166 మంది రోగులు కోలుకున్నారని తెలిపింది.
కాగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 10,956 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,535కు పెరగ్గా మృతుల సంఖ్య 396 తాజా మరణాలతో 8498కి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెద్దసంఖ్యలో పెరుగుతుండటంతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తాజా కోవిడ్-19 హాట్‌స్పాట్స్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కోరారు. మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. పెద్దసంఖ్యలో టెస్టింగ్‌లు జరపాలని, ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment