దేశ రాజధానిలో కుండపోత
న్యూఢిల్లీ: భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం స్తంభించింది. ఈ ఉదయం నుంచి కుండపోతగా వర్షాలు పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు నీట ముగినిగాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై ఎక్కడిక్కడ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. బస్సులు, రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
వర్షాలతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఇండిగో ప్రయాణికులకు తెలిపింది. మరోవైపు అమెరికా మంత్రి జాన్ కెర్రీ నగర పర్యటన రద్దయింది. సిస్గంజ్ గురుద్వారా, జామా మసీదు, గౌరీ శంకర్ ఆలయంను ఆయన సందర్శించాల్సివుంది. వర్షం కారణంగా ఆయన పర్యటన రద్దు చేసుకన్నారు.
యాప్ బేస్డ్ క్యాబ్ సర్వీసులకూ అంతరాయం కలిగింది. ఫోన్ చేసిన వినియోగదారులకు కార్లు అందుబాటులో లేవని ఓలా, ఉబర్ వంటి సంస్థల నుంచి సమాధానం వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ట్రాఫిక్ సమాచారం అందిస్తున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన వాహనదారులు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.