భారత్‌లో కరువు, వరదలు
తీవ్ర వర్షాభావం, తీవ్ర వర్షపాతంతో పెరుగుతున్న ముప్పు స్టాన్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
వాషింగ్టన్: భారత్‌లో తీవ్ర వర్షాలు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు పెరుగుతూ క్రమంగా కరువు, వరదల ముప్పు అధికం అవుతోందని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవలి దశాబ్దాల్లో దక్షిణాసియా రుతుపవనాల సీజన్‌లో ముఖ్యంగా మధ్య భారతదేశంలో కీలక మార్పులు జరుగుతున్నాయని వీరి పరిశోధనలో తేలింది. భారత్‌లో వెట్ స్పెల్స్ (కొద్దిరోజుల పాటు వర్షాలు కురవడం), డ్రై స్పెల్స్(కొద్దిరోజుల పాటు వర్షాభావం) పరిస్థితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఇద్దరు భారత సంతతి శాస్త్రవేత్తలతో కూడిన వీరి బృందం గుర్తించింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ఇతర సంస్థల నుంచి సేకరించిన 60 ఏళ్ల సమాచారం ఆధారంగా వీరు అధ్యయనం నిర్వహించారు. రుతుపవనాల సీజన్‌లో ఏటా కొన్నిసార్లు మాత్రమే సంభవించే డ్రై స్పెల్స్, వెట్ స్పెల్స్‌పై దృష్టిపెట్టిన తాము.. వాటి వల్ల కలిగే ప్రభావాలను అంచనా వేసినట్లు భారత సంతతి అసిస్టెంట్ ప్రొఫెసర్ బాలా రాజారత్నం, పరిశోధక విద్యార్థిని దీప్తి సింగ్ వెల్లడించారు.
1951 నుంచి 2011 వరకూ రెండు విభాగాలుగా గణాంకాలను విశ్లేషించగా.. మొత్తం సగటు వర్షపాతం తగ్గినా.. సీజన్‌లో కీలకమైన జూలై, ఆగస్టు నెలల్లో మాత్రం వర్షపాతం పెరిగినట్లు వీరు గుర్తించారు. అలాగే సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల సంఖ్య కూడా పెరిగినట్లు గుర్తించారు. భూతాపోన్నతితోపాటు గాలులు, గాలిలో తేమ మార్పులు కూడా వర్షపాతంపై ప్రభావం చూపే అవకాశముందని వారు తెలిపారు. అయితే భారత్ లాంటి క్లిష్టమైన భూభాగం ఉన్న దేశంలో ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నదీ తేలాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వీరి పరిశోధన వివరాలు ‘నేచర్ క్లైమేట్ చేంజ్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.