అమృత్‌సర్ : డ్రగ్ మాఫియాను అంతమొందించేందుకు పంజాబ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నిషేధిత డ్రగ్స్ విక్రయించే, అక్రమ రవాణాకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా కఠిన చట్టాన్ని రూపొందిస్తున్నామని కెప్టెన్, సీఎం అమరీందర్ సింగ్ ఇటీవల ప్రకటించారు. ఇకనుంచి ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించి డోపీలుగా తేలితే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని అమరిందర్ బుధవారం హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల అనంతరం చేసే ఎంపిక ప్రక్రియ సమయంలో కొత్త అభ్యర్థులకు సైతం డ్రగ్స్ టెస్ట్‌లు చేస్తామని తెలిపారు. ప్రతి ఏడాది ఉద్యోగులకు వైద్య పరీక్షలతో పాటు డ్రగ్స్ లాంటి ఉత్ప్రేరకాలకు సంబంధించిన టెస్ట్‌లు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
డ్రగ్స్ కారణంగా రాష్ట్ర యువత పెడదోవ పడుతోందని, ఇప్పటికే ఏడాది ఎంతో మంది మాదకద్రవ్యాల కారణంగా మృత్యువాత పడుతున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై మంత్రి తృప్త్ సింగ్ బజ్వా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్‌శాఖలోనూ డీజీపీ నుంచి మొదలు అందరూ పోలీసులకు డోపింగ్ టెస్టులు నిర్వహిస్తాం. కొందరు పోలీసులు ఇప్పటికే డ్రగ్స్‌కు బానిసలు అయ్యుంటారు. మొహాలిలోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ వద్దకు వెళ్లి నేను కూడా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి టెస్టులు చేపించుకుంటా. మంత్రివర్గంలోని అందరూ ఈ వైద్య పరీక్షలకు తప్పనిసరి హాజరు కావాల్సి ఉంటుందని’ వివరించారు.
కాగా, తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మాఫియాను అంతం చేస్తామన్న హామీకి అమరీందర్ కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్మగ్లర్లకు మరణశిక్ష విధించాల్సిందిగా కోరుతూ అమరీందర్ సింగ్ కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. సంబంధిత చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు. ఈ క్రమంలో పలు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడబోమని తమ చర్యలతో కెప్టెన్ మరోసారి నిరూపించారు. సీఎం అమరీందర్ నిర్ణయంపై ఇతర పార్టీల నేతలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment