
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తాజాగా రూపొందించిన పద్మావతి చిత్ర వివాదాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఈ చిత్రంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. హిందువుల చరిత్రపై అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. అందులో భాగంగానే ఇటువంటి చిత్రాలు వస్తున్నాయని ఆయన అన్నారు.
ముస్లిం రాజులను హీరోలు చూపించే ప్రయత్నంలో చరిత్రను వక్రీకరిస్తున్నారని.. ఈ క్రమంలో అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని సుబ్రమణ్యస్వామి చెప్పారు. ముస్లింలను హీరోలుగా చూపించేందుకు దుబాయ్ వాసులు కలలు కంటున్నారని ఆయన అన్నారు. అమీర్‌ఖాన్ తీసిన పీకే చిత్రం కూడా ఈ కోవలోకే వస్తుందని.. ఈ చిత్రం పాకిస్తాన్‌ను ప్రోత్సహించేలా ఉందని ఆయన ఆరోపించారు.
డిసంబర్ 1న విడుదల కానున్న పద్మావతి చిత్రంపై ఇప్పటికే అనే వివాదాలు చుట్టుముట్టాయి. రాజపుత్ర వర్గాలు, కర్నీసేన, ఇతర సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలంటూ పేసిన పిల్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ చిత్రంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. సెన్సార్ బోర్డును సంప్రదించాలని పిల్ దాఖలు చేసిన వారికి సుప్రీం కోర్టు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment