
ఇక టోల్‌గేట్ల వద్ద ఆగక్కర్లేదు!
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ - విజయవాడ హైవే మీద ఉన్న టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరి ఉంటాయి. అక్కడ వేచి ఉండాల్సి రావడంతో బోలెడంత ఇంధనం, సమయం రెండూ వృథా అవుతాయి. దేశంలో చాలాచోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది. దాంతో ఈ ఏడాది ఏప్రిల్ నాటికల్లా 360 టోల్ ప్లాజాలలో ఈ-టోలింగ్ వ్యవస్థను ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇది అమలైతే.. ఇక వాహనాలు టోల్‌గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. వాటికి ముందుండే ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ల ద్వారా టోల్ మొత్తం కట్ అవుతుంది. ముందుగా రీచార్జి చేసుకున్న కార్డుల ద్వారా ఇది సాధ్యమవుతుంది.
ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) చిప్‌లు, ప్రీపెయిడ్ సిస్టమ్ రీఫిల్లింగ్ కోసం ఇంతకుముందు ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే, తర్వాత మళ్లీ వెనక్కి తగ్గాయి. ఇప్పుడు కొత్తగా ఏయే బ్యాంకులు దీన్ని అమలుచేస్తాయన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం దేశంలో 96వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, రాబోయే మూడు నెలల్లో వీటిని 1.52 లక్షల కిలోమీటర్లకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ ఈ సందర్భంగా చెప్పారు.